బాబుకు టార్గెట్ చేసిన స్వామీజీ...!
కానీ ఈసారి కచ్చితంగా పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. దాంతో పాటుగా ఆయన హిందూపురం సీటుని చూసుకున్నారు
By: Tupaki Desk | 28 March 2024 5:54 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా వైసీపీకే ఎపుడూ టార్గెట్. కానీ పొత్తుల ఎత్తులతో కూటమి కట్టిన తరువాత సొంత పార్టీ వారితో పాటు మిత్ర పార్టీల నేతలకు ఆయన టార్గెట్ అవుతున్నారు. బాబు ప్రమేయం లేకుండా సీట్ల పంపిణీ జరగదు అని అంటున్నారు. ఆయన సలహా సూచనలతోనే తమకు సీట్లు గల్లంతు అయ్యాయని అంటున్నారు.
ఇక బీజేపీలో గత పదేళ్ళుగా కీలకంగా కాకినాడకు చెందిన శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఉన్నారు. ఒక దశలో ఆయన పేరు తెలంగాణా సీఎం అభ్యర్ధిగా కూడా ప్రతిపాదిస్తారు అని ప్రచారం సాగింది. ఆయన మాత్రం పదేళ్లలో బీజేపీ తరఫున ఉభయ రాష్ట్రాలలో ప్రచారం చేయడం తప్ప ఎన్నడూ పోటీకి సిద్ధపడలేదు.
కానీ ఈసారి కచ్చితంగా పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. దాంతో పాటుగా ఆయన హిందూపురం సీటుని చూసుకున్నారు. ఎంపీగా అక్కడ నుంచి తాను పోటీ చేస్తాను ఏడాది క్రితమే ఆయన బీజేపీ పెద్దల చెవిన వేసారు. ఆయనకు కేంద్ర బీజేపీ నాయకత్వంతో మంచి పరిచయాలు ఉన్నాయి. నేరుగా వారితో మాట్లాడే చనువు ఉంది.
దాంతో తనకు టికెట్ గ్యారంటీ అనుకున్నారు అయితే చిత్రంగా స్వామీజీకి టికెట్ దక్కలేదు. దాంతో ఆయన మనస్తాపం చెందారు. ఆయన పురంధేశ్వరి వద్దనే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు వల్లనే తనకు హిందూపురం ఎంపీ టికెట్ దక్కలేదని వాపోయారు.
తనకు టికెట్ ఇస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయని చంద్రబాబు భయపడి తనకు టికెట్ రాకుండా బీజేపీ వారికి చెప్పి అలా చేయించారు అని మండిపడ్డారు. తన రాజకీయల కోసం నూటికి ఎనభై అయిదు శాతం ఉన్న హిందువుల మనోభావాలతో బాబు చెలగాటం ఆడతారా అని ఆయన నిలదీస్తున్నారు
బాబు హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు హిందువులను బొందలో పెట్టారు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. హిందూపురంలోనే హిందు పదం ఉందని అది పవిత్రమైన ప్రాంతమని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రస్తానం అక్కడి నుంచే అని ఏడాది క్రితమే బీజేపీ పెద్దలకు చెప్పి ఉంచానని ఆయన అన్నారు. ఆనాడు పొత్తులు లేవని అన్నారు.
ఇపుడు పొత్తుల పేరుతో తనకు సీటు లేకుండా చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తాను మాటకు నిలబడే వ్యక్తిని అని ఆయన అన్నారు. తాను తప్పకుండా పోటీ చేస్తాను అని ఆయన అన్నారు. అయితే బీజేపీ హై కమాండ్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.
ఒకవేళ అదే నిర్ణయం మీద ఉంటే మాత్రం తాను కచ్చితంగా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటాను అని ఆయన హెచ్చరించారు. అంతే కాదు హిందూపురం ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా రెండు సీట్లకి పోటీ చేస్తాను అని స్వామీజీ చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. స్వామీజీ అధ్యాత్మికంగా చాలా మంది ప్రజానీకానికి చేరువ అయ్యారు. ఆయన సేవా కార్యక్రమాలను హిందూపురంలో పెద్ద ఎత్తున చేశారు
ఆయన పోటీ చేయడం వల్ల కూటమిని అందులో టీడీపీకి భారీ నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం హిందూపురం అసెంబ్లీకి బాలయ్య పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు టీడీపీ తీసుకుంది. ఓట్లు భారీగా చీలితే మాత్రం అది కూటమికే దెబ్బ అంటున్నారు.
పైగా బాబుని హిందూ వ్యతిరేకిగా స్వామీజీ చిత్రీకరిస్తూ తన ప్రచరం మొదలెడితే బీజేపీకి కూడా ముప్పే అంటున్నారు. మొత్తానికి స్వామీజీ ధర్మాగ్రహం వ్యక్తం చేశారు అని అంటున్నారు. ఆయనకు ఎంపీ సీటు విషయంలో బీజేపీ హై కమాండ్ జోక్యం చేసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది చర్చగా ఉంది.