‘రాజ గురువు’కు కష్టాలు మొదలు!
శారద పీఠానికి భారీ ఎత్తున భూములను అప్పగించారనే విమర్శలు కూడా వచ్చాయి.
By: Tupaki Desk | 2 July 2024 12:30 PM GMTగతంలో రాజశ్యామల యాగాలు నిర్వహించి ఆయా పార్టీల అధినేతలను అధికారంలోకి తీసుకురావడం ద్వారా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పాపులర్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు భక్తులుగా మారిపోయారు. వీరిలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖులు.
ఆయా రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల ముందు రాజశ్యామల యాగాలు నిర్వహించడం ద్వారా కేసీఆర్, జగన్ లను అధికారంలోకి తెచ్చారనే కీర్తిని స్వరూపానందేంద్ర స్వామి మూటగట్టుకున్నారు. దీంతో సహజంగానే ఆయనకు ప్రాధాన్యం పెరిగిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వంలోనూ స్వరూపానందేంద్ర స్వామి మాటకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
శారద పీఠానికి భారీ ఎత్తున భూములను అప్పగించారనే విమర్శలు కూడా వచ్చాయి. అలాగే స్వరూపానందేంద్రకు వీఐపీ మాదిరిగా సెక్యూరిటీని కూడా జగన్ సీఎంగా ఉన్నప్పుడు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్వరూపానందేంద్ర శిష్యులు కేసీఆర్, జగన్ ఇద్దరూ అధికారంలో లేరు. ఇద్దరూ రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్, జగన్ సీఎంలుగా ఉన్నప్పుడు రాజ గురువుగా చెలామణి అయిన స్వరూపానందేంద్రకు వారు అధికారం పోగొట్టుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం శారదా పీఠం ముందు ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టులను తొలగించింది. అలాగే ఆయనకు ఉన్న భద్రతను కూడా తగ్గించింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కొత్తవలసలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఆయన నాయకత్వంలోని బృందం ఆ 15 ఎకరాల ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ బృందంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, పలు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం 15 ఎకరాల కొండను కారుచౌకగా శారదా పీఠానికి కట్టబెట్టిందని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. శారదా పీఠం ఆ 15 ఎకరాలను వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తుందన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. శారదా పీఠం పూర్తి వ్యాపార ధోరణితో 15 ఎకరాలను తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ అనుమతులను రద్దు చేయాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. చారిత్రక ఆనవాలుగా ఉన్న కొండను సంరక్షించాలని విన్నవించారు.
శారదా పీఠం ఆ 15 ఎకరాలను స్థిరాస్థి వ్యాపారానికి వినియోగిస్తుందని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఆరోపించారు. వైసీపీ క్యాంపు కార్యాలయంలా శారదా పీఠం పనిచేస్తుందన్నారు. శారదా పీఠానికి 2019కి ముందున్న ఆస్తులు ఎంత? ఇప్పుడు బినామీలకు ఉన్న ఆస్తులెంతో ప్రభుత్వం లెక్కతేల్చాలని కోరారు.