Begin typing your search above and press return to search.

2 కాదు 5కోట్లు..ఫ్లాటివ్వండి..ఒలింపిక్ విజేత తండ్రి గొంతెమ్మ కోర్కె

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ లో స్వప్నిల్‌ కుశాలె సాధించిన కాంస్యం అతడిని చరిత్రలో నిలిపింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 4:30 PM GMT
2 కాదు 5కోట్లు..ఫ్లాటివ్వండి..ఒలింపిక్ విజేత తండ్రి గొంతెమ్మ కోర్కె
X

టోక్యో (2020) ఒలింపిక్స్ లో మంచి ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన భారత్ కు చేదు అనుభవమే ఎదురైంది. టోక్యోలో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రోయర్.. పారిస్ లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఒక్క స్వర్ణమైనా వచ్చి ఉంటే మన దేశం పతకాల పట్టికలో ఎక్కడికో వెళ్లి ఉండేది. కానీ.. జావెలిన్ తో పాటు బ్యాడ్మింటన్ లోనూ ఆటగాళ్లు నిరాశపరిచారు. చివరకు హాకీలో గతంలో సాధించిన కాంస్యం సాధించి పరువు నిలిపింది. అయితే, పారిస్ లో భారత్ ను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది మాత్రం షూటర్లే.

ఆమె 2.. అతడు 1

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. మొత్తం సాధించిన పతకాలు 6. ఇందులో ఒక రజతం (జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా), ఐదు కాంస్యాలు ఉన్నాయి. హాకీలో ఒక కాంస్యం దక్కగా మను బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, ఇదే అంశంలో సరబ్ జోత్ సింగ్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ లోనూ కాంస్యం నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుశాలె కాంస్యం సాధించాడు. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ లో అమన్ షెరావత్ కూడా కాంస్యం నెగ్గాడు. కాగా, టోక్యోలో భారత్ ఏడు పతకాలు నెగ్గింది. ఇందులో నీరజ్ స్వర్ణం, రెండు రజతాలు ఉండడంతో పతకాల పట్టికలో 48వ స్థానంతో గౌరవప్రదంగా వెనుదిరిగింది. పారిస్ లో మాత్రం రజతమే దక్కడం, మిగతావన్నీ కాంస్యాలే కావడంతో 71వ స్థానానికి పడిపోయింది. డబుల్ డిజిట్ అనుకుంటే.. గతంలో కంటే ఒకటి తగ్గింది.

కుశాలె.. చరిత్రకెక్కాడు..

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ లో స్వప్నిల్‌ కుశాలె సాధించిన కాంస్యం అతడిని చరిత్రలో నిలిపింది. ఎందుకంటే.. కుశాలె.. మహారాష్ట్ర నుంచి 72 ఏళ్లలో ఒలింపిక్ పతకం సాధించిన రెండో క్రీడాకారుడు. ఈ విభాగంలో ఒలింపిక్‌ పతకం గెలిచిన భారత తొలి షూటర్‌ గానూ చరిత్ర సృష్టించాడు. అయితే, అతడికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం కాంస్యం సాధించినందుకు రూ.2 కోట్లు దక్కాయి. కానీ, ఈ మొత్తం చాలదంటున్నాడు కుశాల్ తండ్రి.. నీరజ్ చోప్రా, మనుబాకర్ కు హరియాణా ప్రభుత్వం ఇచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. స్వప్నిల్‌ కు రూ.5 కోట్లతో పాటు పుణెకు చెందిన బలేవాడీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ఫ్లాట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

రైటా...రాంగా?

స్వప్నిల్ తండ్రి అడుగుతున్న దాంట్లో కొంత సహేతుకత ఉంది. మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం. దానితో పోలిస్తే హరియాణా చాలా చిన్నది. అక్కడి ప్రభుత్వం ఐదు కోట్లు ఇవ్వగా.. అందులోనూ మహారాష్ట్ర నుంచి 72 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం నెగ్గిన క్రీడాకారుడిని సముచితంగా గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోనే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. హరియాణా నుంచి నలుగురు పతకాలు నెగ్గారని.. వారందరికీ 5 కోట్లు వచ్చాయని పేర్కొంటున్నారు. అంతేకాదు.. పుణెలో స్టేడియం దగ్గర్లో ఫ్లాట్ కేటాయిస్తే.. స్వప్నిల్ రోజూ ప్రాక్టీస్‌కు వెళ్లడానికి సులభంగా ఉందంటున్నాడు. ఇదంతా సరైన వాదనే అనిపిస్తోంది. అయితే, మరోటి మాత్రం కాస్త విడ్డూరంగా తోచింది. అదేమంటే.. 50 మీటర్లు 3 పొజిషన్స్ రైఫిల్‌ షూటింగ్ ప్రాంతానికి స్వప్నిల్ పేరు పెట్టాలని అడగడం.

మొదటిసారే..

ఒలింపిక్స్ లో పాల్గొనడం స్వప్నిల్ కు మొదటిసారి. ఇందులోనే కాంస్యం సాధించాడు. మూడు వేర్వేరు కోణాల్లో 50 మీటర్ల దూరంలోని లక్ష్యానికి గురిపెట్టడాన్ని 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ అంటారు. 29 ఏళ్ల స్వప్నిల్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్ దగ్గర ఉండే కంబల్వాడి గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఒలింపిక్ పతకం నెగ్గాక రైల్వేశాఖ అతడికి ప్రమోషన్ ఇచ్చింది.