జగన్ రాజ గురువు సంచలన నిర్ణయం!
విశాఖ శ్రీ శార దా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజకీయ నేతలకు ఆయన చాలా ఇష్టుడైన స్వామీజీగా చెబుతుంటారు
By: Tupaki Desk | 18 Nov 2023 10:00 AM GMTవిశాఖ శ్రీ శార దా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజకీయ నేతలకు ఆయన చాలా ఇష్టుడైన స్వామీజీగా చెబుతుంటారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజ గురువుగా స్వరూపానందేంద్రను అంతా అభివర్ణిస్తుంటారు. కీలక పదవులు కావాల్సిన వాళ్లు ఆయనతో సీఎం జగన్ కు సిఫార్సు చేయించుకుంటారని.. కీలక పదవుల్లో స్వామీజీ మాట చాలాసార్లు చెల్లుబాటు అయ్యిందని బయట టాక్.
కాగా ఇన్నాళ్లూ విశాఖపట్నం నగరానికే పరిమితమైన శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర తన మకాంను హైదరాబాద్ కు మార్చడానికి నిర్ణయించారు. విశాఖలో తన చివరి పుట్టిన రోజు గడుపుతానని.. ఇక ఆ తర్వాత తన జీవితమంతా హైదరాబాద్ లోనే ఉంటానని స్వరూపానందేంద్ర సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో విశాఖ శారదా పీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్వరూపానందేంద్ర తెలిపారు. విశాఖలో ఇదే తన చివరి జన్మదినోత్సవమని చెప్పారు. వచ్చే ఏడాది షష్టిపూర్తి కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో చేసుకుంటానని వెల్లడించారు. అక్కడే ఉంటూ ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు చేపడతానని వివరించారు. ఈ మేరకు నవంబర్ 17న ఆయన తన జన్మదినోత్సవాన్ని విశాఖ శారదా పీఠంలో ఘనంగా నిర్వహించారు.
తాను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోందన్నారు. తాను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని చెప్పారు. శారదా పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది.. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తానని వెల్లడించారు. విద్యాధికుడైన ఆయన ధర్మ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటారు అని తెలిపారు.
మరోవైపు స్వరూపానందేంద్ర శిష్యుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలనను జనవరి నుంచి విశాఖ నుంచి చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రుషికొండపై ఉన్న నిర్మాణాలను సీఎం నివాసానికి, క్యాంప్ ఆఫీసుకు అధికారుల కమిటీ ఎంపిక చేసింది. వాటినే ప్రభుత్వానికి సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి రాజ గురువుగా పేరున్న స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్ కు వెళ్లిపోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.