Begin typing your search above and press return to search.

‘అతిశీ సిగ్గు సిగ్గు’.. సీఎం డ్యాన్స్ పై మలీవాల్ మరో బాంబు

అతిశీ చేసిన పనిపై ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్‌ విమర్శలు గుప్పించారు. పార్టీ ఓడినా, ఓ సీఎంగా అతిశీ ఇలా చేయడం ఏమిటని నిలదీశారు.

By:  Tupaki Desk   |   9 Feb 2025 9:45 AM GMT
‘అతిశీ సిగ్గు సిగ్గు’.. సీఎం డ్యాన్స్ పై మలీవాల్ మరో బాంబు
X

ఇద్దరూ మహిళా నేతలే.. ఇద్దరికీ పార్టీ సమ ప్రాధాన్యం ఇచ్చింది.. కానీ, కాలం ఒకరిని సీఎంను చేస్తే, మరొకరిని వెలి వేసేలా చేసింది.. ఇప్పుడు ఎంపీ ఆనందంగా ఉంటే, సీఎం మాత్రం మాజీ అయ్యారు. పదవి దక్కినా.. ఆత్మగౌరవం దెబ్బతినడంతో ఎంపీ రెబల్ గా మారారు. సీఎం అయినా పార్టీ ఓడిపోవడంతో మరొకరు మాజీగా మిగిలారు. ఇదంతా ఆప్ నాయకురాళ్లు ఢిల్లీ మాజీ సీఎం అతిశీ, ఎంపీ స్వాతి మలివాల్ గురించి.

శనివారం ఫలితాల వెల్లడి సందర్భంగా.. ఆప్ ఓటమిని ఎద్దేవా చేస్తూ కౌరవ సభలో ద్రౌపది ఫొటోను షేర్ చేశారు ఆ పార్టీ మహిళా ఎంపీ స్వాతి మలీవాల్. ఇప్పుడు మాజీ అవుతున్న సీఎం అతిశీని టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దాడి చేసినా ఆప్ నాయకత్వం పట్టించుకోలేదనేది మలివాల్ ఆగ్రహం. అందుకే పార్టీని కౌరవ సభతో పోల్చారు.

శనివారం వెలువడిన ఫలితాల్లో అతిశీ కాల్‌ కాజీ స్థానం నుంచి నెగ్గారు. అయితే, పార్టీ అధినేత కేజ్రీవాల్ తో పాటు కీలక నాయకులు అందరూ ఓటమిపాలయ్యారు. పార్టీనే అధికారం కోల్పోయింది. కానీ, సీఎం అతిశీ మాత్రం కాల్ కాజీ నుంచి గెలిచాక నృత్యం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అతిశీ చేసిన పనిపై ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్‌ విమర్శలు గుప్పించారు. పార్టీ ఓడినా, ఓ సీఎంగా అతిశీ ఇలా చేయ్డం ఏమిటని నిలదీశారు. అధికారం కోల్పోవడమే కాక, వ్యక్తిగతంగా ఓటమితో కేజ్రీ కుమిలిపోతున్నా.. ఇదేమీ పట్టనట్లు అతిశీ డ్యాన్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ దుయ్యబట్టారు.

వివాదాస్పద బీజేపీ అభ్యర్థి రమేశ్‌ బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో అతిశీ గెలుపొందారు. అయితే, ఇది కూడా అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఓట్ల లెక్కింపు సమయంలో తొలి నుంచి అతిశీ వెనుకంజలో ఉన్నారు. చివర్లో అనూహ్యంగా పుంజుకొని గెలుపు దక్కించుకున్నారు.

ఇక ఆప్ 2014 నుంచి ఢిల్లీలో అధికారంలో ఉంది. పాలనా వైఫల్యాలు, కుంభకోణాలు, యమునా నది కాలుష్యం తదితరాలతో ఈసారి పరాజయం ఎదుర్కొంది. కాగా, అతిశీ సీఎం పదవికి ఆదివారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. అతిశీ సెప్టెంబరులో సీఎం అయ్యారు. సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్) తర్వాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశీ రికార్డుల్లో నిలిచారు.