'అతడు నన్ను కాలితో తన్నాడు'... ఆప్ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 17 May 2024 7:14 AM GMTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడికి పాల్పడ్డారనే ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. బిభవ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు.
అవును... దేశంలో లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో ఆప్ రాజ్యసహ మహిళా ఎంపీ పై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు దాడి చేశాడనే విషయం తీవ్ర వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో ఎంపీ స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆమె చెప్పారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా.. తనపై జరిగిన దాడి ఘటనను పోలీసులకు ఎంపీ స్వాతీ మాలీవాల్ సవివరంగా వివరించారని అంటున్నారు. ఇందులో భాగంగా... సీఎం నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడికి దిగాడు. చెంపపై కొట్టాడు.. కాలితో తన్నాడు.. కర్ర తీసుకుని బాదాడు అని తెలిపారు.
ఇదే సమయంలో... తనపై కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని.. ఈ నేపథ్యంలో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి.. పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో... ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
కాగా... ఈ నెల 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై స్వాతి తొలిసారిగా స్పందించారు. ఇదే సమయంలో... ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు.