కొత్త ఆఫర్... దేశాన్ని వీడితే క్యాష్ ఇస్తారు.. ఫ్లైట్ టిక్కెట్ ఫ్రీ!
తాజాగా దేశంలో స్థిరపడిన పౌరులకు స్వీడన్ కొత్త ఆఫర్ ఒకటి ప్రకటించింది.
By: Tupaki Desk | 17 Aug 2024 10:30 PM GMTతాజాగా దేశంలో స్థిరపడిన పౌరులకు స్వీడన్ కొత్త ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇతర దేశాల్లో పుట్టి, స్వీడన్ లో ఉంటున్న పౌరులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా... ఇతర దేశాల్లో జన్మించి స్వీడన్లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే వారికి కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో ప్రయాణ ఖర్చులు బోనస్!
అవును... తాజాగా స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఇతరదేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్ల్ లో సెటిల్ అయిన పౌరులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే వారికి 10వేల స్వీడన్ క్రౌన్స్ (భారత కరెన్సీలో రూ.80 వేలు) బహుమతిగా ఇస్తారు. ఇక చిన్నారులకైతే అందులో సగం. ఇక ఈ నగదుతో పాటు వారి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ భిన్నమైన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇలాంటి ప్రతిపాదనను స్వీడన్ తెరపైకి తేవడానికి ఆ దేశ జనాభా పెరుగుదలే కారణం అని అంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా స్వీడన్ లో జనాభా విపరీతంగా పెరిగింది. దీనికి కారణం ఇతర దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉండటమే అని అంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాల్మెర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రజలు స్వీడన్ వాతావరణంలో ఇమడలేకపోతున్నారు.. అటువంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకొచ్చారు. మరోపక్క... ఈ తాజా ప్రతిపాదనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందులో భాగంగా.. స్వీడన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది అంటూ ప్రశ్నించారు భారత ఆర్థిక వేత్త, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్. ఏది ఏమైనా... తాజాగా స్వీడన్ దేశం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.