జీవితాంతం ఆకాశంలోనే ఎగురుతూ గడిపేసే డెవిల్ పక్షి గురించి మీకు తెలుసా?
దెయ్యం పక్షి అని పిలవబడే ఈ పక్షి సుమారు సంవత్సరం పాటు నేల మీదకు దిగకుండా ఆకాశంలోని తిరుగుతుంది.
By: Tupaki Desk | 26 Sep 2024 4:58 AM GMTమనలో చాలామందికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అలా హాయిగా కాసేపు సాయంకాలం బయట గడిపేటప్పుడు మనకు ఎన్నో రకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్నో జాతుల పక్షులు ఉన్నప్పటికీ వాటిలో మనకు కొన్నిటి గురించి మాత్రమే తెలుసు. అయితే ఒక పక్షి సుమారు సంవత్సరం పాటు ఆగకుండా ఎగురుతుంది అన్న విషయం మీకు తెలుసా. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.. ఆ పక్షి అలా నెలలు తరబడి భూమిపైన దిగకుండా గాల్లోనే చెక్కర్లు కొడుతూ ఉంటుంది. మరి ఆ పక్షి ఏమిటో? అది ఎందుకు ఆకాశం నుంచి కిందకు దిగదో తెలుసుకుందాం పదండి..
దెయ్యం పక్షి అని పిలవబడే ఈ పక్షి సుమారు సంవత్సరం పాటు నేల మీదకు దిగకుండా ఆకాశంలోని తిరుగుతుంది. ఆ సమయంలో యూరప్ నుంచి ఆఫ్రికా కి వెళ్లి మళ్లీ ఆఫ్రికా నుంచి యూరప్ కి చేరుకుంటుంది. దీనితోపాటు ఆ పక్షి లో ఎన్నో అద్భుతమైన లక్షణాలు కూడా ఉన్నాయట. అత్యంత వేగంగా ఎగరడంతో పాటు గాల్లోనే తనకు అవసరమైన ఆహారాన్ని వేటాడి తినే లక్షణం కూడా ఈ పక్షి జాతికి ఉంది. అవి కేవలం పిల్లలను కనడానికి మాత్రమే నేల మీదకు దిగి వస్తాయి. ఈ పక్షి అసలు పేరు స్విఫ్ట్.
స్విఫ్ట్ జాతికి చెందిన ఈ పక్షులకు పొడవాటి రెక్కలతో పాటు చిన్న కాళ్ళు ఉంటాయి. ఇవి తరచుగా గుంపులుగా విహరిస్తూ ఉంటాయి. తన జీవితకాలంలో అది 99% కంటే ఎక్కువ గాలిలోనే గడుపుతుంది. ఎదిగే దశలో స్విఫ్ట్ లు ఎక్కువగా కీటకాలను తినడానికి ఇష్టపడతాయి. వలస పక్షి అయిన కామన్ స్విఫ్ట్ శీతాకాలం ఎక్కువగా వెచ్చని ప్రాంతాల వైపు పయనిస్తుంది. అలా వలస సమయంలో ఆల్పైన్ జాతికితే చెందిన స్విఫ్ట్ పక్షులు సుమారు 200 రోజులపాటు ఆగకుండా గాలిలో ఎగురుతాయి. ఈ సమయంలో గాలిలో ఎగిరే కీటకాలను తిని అవి తమ ఆకలి తీర్చుకుంటాయి. ఇవి గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగర గలవు. వాతావరణం అనుకూలించని సమయాలు, సంతాన ఉత్పత్తి కాలంలో మాత్రమే ఇవి భూమిపైన ల్యాండ్ అవుతాయి.