భారత్ కు ఆ హోదా రద్దు చేసిన స్విస్ సర్కారు.. కారణం ఇదే
తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. భారతదేశానికి ఇచ్చిన ‘అత్యంత సానుకూల దేశం’ హొదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 14 Dec 2024 4:01 AM GMTకొన్ని పరిణామాల్ని కొన్ని దేశాలు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. తమ దేశానికి కంపెనీ ప్రయోజనాన్ని దెబ్బ తీసే పరిణామాల్ని ఆయా దేశాలు స్పందించే తీరు చూసినప్పుడు కాస్తంత ఆశ్చర్యంతో పాటు.. విస్మయానికి గురి చేస్తుంది. కంపెనీల విషయంలో ఏదైనా దేశం అడ్డగోలుగా వ్యవహరిస్తే.. వారికి దన్నుగా నిలవటంలో అర్థముంది. కానీ.. కోర్టు తీర్పుపై గుర్రుతో సదరు దేశంతో తాము వ్యవహరించే తీరును మార్చుకోవటం చూస్తే.. తమ కంపెనీలకు ఆయా దేశాలు ఎంత దన్నుగా నిలుస్తాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. భారతదేశానికి ఇచ్చిన ‘అత్యంత సానుకూల దేశం’ హొదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం తమ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ ప్రయోజనాల విషయంలో భారత్ కు చెందిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావటం ప్రధాన కారణంగా చెప్పాలి. ఇంతకూ ఆ కంపెనీ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. మన దేశంలోని దాదాపు ప్రతి ఇల్లు ఆ సంస్థ ఉత్పత్తుల్ని వాడుతుంది. అదేనండి.. నెస్లే. కాఫీ.. న్యూడిల్స్.. కిట్ కాట్ చాక్లెట్ మొదలు ఎన్నో ఉత్పత్తులతో సుపరిచితమైన నెస్లే సంస్థకు సంబంధించి ఒక కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారాయి.
అంతే.. ఆ సంస్థ మాతృ దేశ సంస్థ సీరియస్ అయ్యింది. కేసు విషయానికి వెళితే.. నెస్లే సంస్థపై నమోదైన కేసులో 2021లో ఢిల్లీ హైకోర్టు ఆ కంపెనీకి సానుకూలంగా తీర్పును ఇచ్చింది. డీటీఏఏలోని ఎంఎఫ్ఎన్ క్లాజును పరిగణలోకి తీసుకొని పన్ను రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. 2023 అక్టోబరు 19న ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు తీర్పును మార్చింది.
ఆదాయపన్ను చట్టం సెక్షన్ 90 ప్రకారం.. నోటిఫికేషన్ లేకుండా ఎంఎఫ్ఎన్ క్లాజును నేరుగా అమలు చేయలేమని తేల్చింది. దీంతో.. ఆ సంస్థపై పన్ను భారం పడుతుంది. అంతే.. దీనిపై తాజాగా స్విస్ ప్రభుత్వం స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంలో భాగంగా ఇచ్చిన హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం చూపనుంది. దీంతో.. స్విస్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలపై అధిక పన్ను భారం పడే ఛాన్సు ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్ లో ఉండే భారత కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై పది శాతం పన్ను విధిస్తారు. ఇది.. స్విస్ లో కార్యకలాపాలు నిర్వహించే భారత కంపెనీలకు అదనపు భారంగా మారనుంది. మరి.. దీనిపై భారత సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.