సైద్నాన్.. ఓ సైతాన్.. సిరియాలో భూమ్మీద అసద్ సృష్టించిన నరకం
ఒకటీ రెండేళ్లు కాదు.. నిరాటంకంగా 55 ఏళ్ల పాలన.. పైగా నియంత.. కూల్ గా కనిపిస్తూనే ప్రాణాలు నిలువునా తోడేసేంత క్రూరత్వం
By: Tupaki Desk | 10 Dec 2024 9:30 PM GMTఒకటీ రెండేళ్లు కాదు.. నిరాటంకంగా 55 ఏళ్ల పాలన.. పైగా నియంత.. కూల్ గా కనిపిస్తూనే ప్రాణాలు నిలువునా తోడేసేంత క్రూరత్వం.. అలాంటివాడికి ఎదురు తిరిగితే ఏమైనా ఉందా..? అది రష్యా అయినా.. ఉత్తర కొరియా అయినా.. చివరకు సిరియా అయినా... మొన్నటివరకు బషర్ అల్ అసద్ పాలనలో ఉండగా ఆ దేశంలో ఏం జరిగిందో బయటి ప్రపంచానికి తెలియరాలేదు. ఇప్పుడు అసద్ పరారీతో అసలు సంగతి కనిపిస్తోంది.
గళమెత్తితే ఖతమే..
ప్రజాస్వామ్య దేశాల్లోనే నిరసనలను సహించని నాయకులు ఉన్న రోజులివి. అలాంటిది నియంత పానలలోని సిరియాలో గళమెత్తితే ఇంకేమైనా ఉందా? ఇలాంటి వారు ఒక్కరున్నా సహించేది లేదని బషర్ తేల్చిచెప్పారట. దీంతో సర్కారును ప్రశ్నించిన వారిని నేరుగా జైల్లో వేసేవారట. అయితే, అది అన్ని జైళ్లలా కాదట. ఓ నరకమేనట. కొన్ని వేల ప్రాణాలు ఇందులో కలిసిపోయాయట.
సైద్నాయ.. ఓ సైతాన్ ప్రదేశం
బషర్ సృష్టించిన జైలు పేరు సైద్నాయ. సిరియా రాజధాని డమాస్కస్ శివారులో ఉందిది. ‘సిరియా వధశాల’ అనేది దీనికి ఉన్న పేరు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేకులను బంధించి చిత్రహింసలు పెట్టేవారట. కరెంట్ షాక్ లు, అత్యాచారాలు, హత్యలు కూడా ఈ జైల్లో జరిగినట్లు చెబుతారు. గత ఆదివారం హయాత్ తహరీర్ అల్-షామ్ మిలిటెంట్ గ్రూప్ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాక గంటల్లోనే జైళ్లలోని బందీలను విడుదల చేశారు.
2011 నుంచి..
2000 సంవత్సరంలో సిరియా అధ్యక్షుడైన అసద్.. 2011 నుంచి క్రూరుడిగా మారారు. అరబ్ విప్లవం స్ఫూర్తితో.. సిరియా ప్రభుత్వంపై ఉద్యమం మొదలైన నాటి నుంచి వ్యతిరేకులను ‘సైద్నాయ’ జైలుకు తరలించేది. ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2017లో వేసిన అంచనాల ప్రకారం 10 వేల నుంచి 20 వేల మంది సైద్నాయలో ఉన్నారట. చంపే ఉద్దేశంతోనే ఇక్కడికి తరలిస్తారని.. ఇలా సామూహికంగా చాలామందిని హత్య చేసేవారని పేర్కొంది. చిత్రహింసల గాయాలు, వ్యాధులు, ఆకలితో చనిపోయినవారిని తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్ వేసేవారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని కళ్లారా చూసినవారు అన్నం మానేసి స్వచ్ఛందంగా ప్రాణాలు తీసుకున్నారట.
2011 నాటి నుంచి సిరియాలో గాయబ్ అయినవారి సంఖ్య లక్షన్నర అట. వీరిలో వేలమంది ‘సైద్నాయ’కే వెళ్లినట్లు చెబుతారు. ఇందులో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు.
చంపేసే ‘పార్టీ’
మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించి సైద్నాయ తీసుకొచ్చేవారట. ఇందులోని ‘వై’ ఆకారం ఎర్ర రంగు భవనాల్లో హతమార్చేవారట. కేవలం ఒకటి నుంచి మూడు నిమిషాల్లో ముగిసిపోయేదట. దీనిని వారు పార్టీగా అభివర్ణించేవారు. జైల్ లోని గదుల నుంచి బయటకు తీసుకొచ్చి.. సాధారణ పౌర జైళ్లకు తరలిస్తున్నట్లు అబద్ధం చెప్పేవారు. వై ఆకారం భవనాల్లోని భూగర్భ గదుల్లోకి తరలించేవారు. 2-3 గంటలు చిత్రహింసలకు గురిచేసి అర్ధరాత్రి కాగానే కళ్లకు గంతలు కట్టి.. మినీ బస్ లేదా ట్రక్కులో ఒక తెల్లటి భవనానికి తరలిస్తారు. అక్కడి భూగర్భ గృహంలో ఉరి తీసేవారట.
ఇది ప్రతి వారం లేదా రెండు వారాలకోసారి జరిగేదట. ఉరికి కొద్దిగా ముందు మాత్రమే వారికి ఆ విషయం చెప్పేవారట. ఉరి ప్రక్రియ ముగిశాక మృతదేహాలను ట్రక్కుల్లో తీసుకెళ్లి సామూహిక సమాధిలో ఖననం చేసేవారట. 2015కు ముందు కాస్త ఓపెన్ గానే దీనిని చేసినా.. ప్రజల తిరుగుబాటు తర్వాత ఇంకా తీవ్రత పెంచి, పూర్తి రహస్యంగా అమలు చేసినట్లు తెలుస్తోంది.