Begin typing your search above and press return to search.

2 రోజులు.. వెయ్యిమంది హతం.. ఆ దేశంలో వీధుల్లో మృతదేహాల గుట్టలు

పశ్చిమాసియా అంటేనే అత్యంత కల్లోలం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణలతో ఏడాదిన్నర నుంచి రావణకాష్టంగా రగులుతూ ఉంది ఆ ప్రాంతం

By:  Tupaki Desk   |   9 March 2025 8:03 PM IST
2 రోజులు.. వెయ్యిమంది హతం.. ఆ దేశంలో వీధుల్లో మృతదేహాల గుట్టలు
X

ప్రాణాలు గాల్లో ఉండడం అంటే ఇదేనేమో..? ఊచకోతకు అర్థం ఇదేనేమో..? అంతర్యుద్శం ఇలాగే ఉంటుందేమో..? అన్నట్లుగా ఆ దేశంలో హింస చెలరేగుతోంది.. ఎంతగా అంటే.. వీధుల్లో శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.. బయటకు వస్తే ప్రాణం పోయినట్లే అనే పరిస్థితి ఉండడంతో వాటిని కనీసం పట్టించుకునేవారు లేరు.. కేవలం రెండు రోజుల్లోనే వెయ్యి మందిపైగా ఊచకోతకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పశ్చిమాసియా అంటేనే అత్యంత కల్లోలం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణలతో ఏడాదిన్నర నుంచి రావణకాష్టంగా రగులుతూ ఉంది ఆ ప్రాంతం. ఇదే ప్రాంతంలోని సిరియాలో ఇప్పుడు హింస చెలరేగుతోంది. ఈ దేశ మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మూడు నెలల కిందట పదవిని వదిలేసి రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే.

నాడు అసద్ ను కేవలం రెండు రోజుల్లో సాగనంపారు తిరుగుబాటుదారులు. అయితే, ఇప్పుడు అసద్ మద్దతుదారులు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో సిరియాలో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్‌ వర్గం ఘర్షణల్లో రెండు రోజుల్లో వెయ్యిమంది పైగా ప్రాణాలు కోల్పోయారు.

2014లో సిరియాలో అసద్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. దీన్ని రష్యా సాయంతో ఆయన అణచివేశారు. అయితే, ఆ అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా తాజా ఘటన అని అంటున్నారు.

అసద్‌ మద్దతుదారులు దాడికి దిగగా భద్రతా దళాలు ప్రతి దాడి మొదలుపెట్టాయి. దీంతో 745 మంది సాధారణ పౌరులు, 125 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్‌ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు.

ముస్లింలలోనే అసద్ ది అలావైట్ తెగ. ఈ వర్గం సిరియాలో మైనారిటీ. కానీ, 50 ఏళ్లకుపైగా సిరియాలో వీరిదే రాజకీయ అధికారం. అసద్ ను ఎట్టకేలకు సాగనంపినా లకాటియా ప్రాంతంలో ఆయన వర్గానికి పట్టుంది. ఇప్పుడీ ప్రాంతంలోనే తిరుగుబాటుతో విద్యత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది.

అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోగా.. తిరుగుబాటుదారులు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీన్ని అసద్ వర్గం వ్యతిరేకిస్తూ జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రభుత్వ దళాలు వెళ్లి ఊచకోతకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇళ్లకు నిప్పంటిచడంతో పెద్దఎత్తున ఘర్షణలకు దిగుతున్నారు. బనియాస్ పట్టణంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నాయి.

సిరియాలో అసద్ పాలన సమయంలో రష్యా దళాలు ఉన్నాయి. అసద్ తప్పుకొనే సమయంలోనే అవి కూడా వైదొలగాయి. ఇప్పుడు అక్కడ తిరుగుబాటుదారుల ప్రభుత్వానికి అమెరికా పరోక్ష మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఘర్షణలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి.