Begin typing your search above and press return to search.

‘విజేత’ సంబరాలు.. అర్థరాత్రి వేళ హైదరాబాదీలంతా రోడ్ల మీదకు!

అదెంత భారీగా అన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది హైదరాబాద్ మహానగరం.

By:  Tupaki Desk   |   30 Jun 2024 5:09 AM GMT
‘విజేత’ సంబరాలు.. అర్థరాత్రి వేళ హైదరాబాదీలంతా రోడ్ల మీదకు!
X

హైదరాబాద్ మహానగరంలో అరుదైన ఒక దృశ్యం ఆవిష్క్రతమైంది. ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ ను మరోసారిసొంతం చేసుకున్న టీమిండియా క్రికెట్ జట్టు ఆట తీరుతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అదెంత భారీగా అన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది హైదరాబాద్ మహానగరం. సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన వైనం అర్థరాత్రి వేళ తేలిపోయినంతనే.. విపరీతమైన ఆనందంతోఉక్కిరిబిక్కిరి అయ్యారు క్రికెట్ అభిమానులు.

యావత్ హైదరాబాద్ మొత్తం.. రోడ్ల మీదకు వచ్చేసింది. మిఠాయిలు పంచుకుంటూ.. భారత్.. భారత్ అంటూ నినాదాలు చేయటమే కాదు.. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో దర్శనీయ స్థలాలైన ట్యాంక్ బండ్.. సచివాలయం.. బిర్లా మందిర్.. రవీంద్ర భారతి.. కూకట్ పల్లి.. చార్మినార్.. నక్లెస్ రోడ్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. మొత్తం హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది.

రోడ్ల మీదకు వచ్చిన క్రికెట్ అభిమానులు ఎవరికి వారు తమదైన ఆనందాన్ని ప్రదర్శించారు. పండుగ చేసుకున్నారు. బాణసంచా కాల్చినోళ్లు కొందరైతే.. స్వీట్ పంచిన వారు మరికొందరు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తమకు కనిపించిన ప్రతి ఒక్కరితోనూ విజయానందాన్ని షేర్ చేసుకున్నారు. దీంతో.. రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. కాలనీల్లో అప్పటికప్పుడు వేడుకలు నిర్వహించారు. మొత్తంగా టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచిన వేళ.. అందరూ తమ ఆనందాన్ని ప్రదర్శిస్తే.. హైదరాబాదీయులు మాత్రం తమకు సాటి మరెవరూ రారన్న చందంగా తెల్లవారే వరకూ రోడ్ల మీద సందడి చేశారు. ఈ సందర్భంగా బైకులు.. కార్లతో ప్రధాన కూడళ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి.