Begin typing your search above and press return to search.

ఏమిటివి? మృత్యుకుహరాలుగా టేబుల్ టాప్ రన్ వే!

ప్రపంచంలో చోటు చేసుకునే విమాన ప్రమాదాల్లో అత్యధికం టేబుల్ టాప్ రన్ వేకు సంబంధించినవే.

By:  Tupaki Desk   |   24 July 2024 5:30 PM GMT
ఏమిటివి? మృత్యుకుహరాలుగా టేబుల్ టాప్ రన్ వే!
X

ప్రపంచంలో చోటు చేసుకునే విమాన ప్రమాదాల్లో అత్యధికం టేబుల్ టాప్ రన్ వేకు సంబంధించినవే. తాజాగా నేపాల్ ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతున్న విమానం హటాత్తుగా కూలిపోవటం.. ఈ ప్రమాదంలో పైలెట్ మినహా మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ రన్ వే నుంచి టేకాఫ్ తీసుకోవటమే. ఆ మాటకు వస్తే టేకాఫ్ మాత్రమే కాదు.. ల్యాండింగ్ సైతం అత్యంత కఠిన పరీక్షగా చెబుతారు. అత్యధిక విమాన ప్రయాణాలు ఈ తరహా రన్ వేల మీదనే చోటు చేసుకుంటూ ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకూ టేబుల్ టాప్ రన్ వే అంటే ఏమిటి? అన్నది ప్రశ్న.

దీనికి సమాధానం అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఈ తరహా రన్ వేలు మిగిలిన రన్ వేలకు భిన్నంగా ఉంటాయి. ఈ రన్ వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే.. నేల మీద టేబుల్ వేస్తే ఎలా ఉంటాయో.. ఈ రన్ వేల్ని తయారు చేస్తాయి. దూరం నుంచి చూస్తే.. రన్ వే.. పక్కనున్న భూభాగం సమాంతరంగా ఉన్నట్లు ఉంటుంది. వాస్తవంలో ఒక వైపు కానీ రెండు వైపులా కానీ లోయలా ఉంటుంది. మధ్యలో ఎత్తుగా ఉండి.. అక్కడి నుంచే టేకాఫ్.. ల్యాండింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా చోటు చేసుకునే ఏ చిన్న పొరపాటు జరిగినా విమానం ఓవర్ షూట్ అవుతుంది. పరిస్థితి చేజారిపోయి.. ఘోర విషాదానికి కారణంగామారుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేపాల్ ప్రమాదానికి ఇదో కారణంగా చెబుతున్నారు. మనం విమానంలో ప్రయాణించినప్పుడు.. మనలో కొందరికి టేకాఫ్.. ల్యాండింగ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటే.. మరికొందరికి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు.

విమానాల్లో ప్రయాణించే చాలామందికి కూడా తెలియని విషయం ఏమంటే.. విమానం ల్యాండ్ అయ్యే వేళలో.. టైరు ఎక్కడ నుంచి ఎక్కడ లోపు నేలను తాకాలో పక్కాగా మార్కు చేసి ఉంటుంది. సరిగ్గా విమాన టైర్ ను అక్కడే తాకించాల్సి ఉంటుంది. దీన్ని పైలెట్లు పక్కాగా ఫాలో అవుతుంటారు. అయితే.. వర్షాలతో కానీ.. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితుల్లో రన్ వే సరిగా కనిపించని పరిస్థితుల్లో ఈ మార్కింగ్ నేలను దాటేసి టైరు తాకుతుంది. దీన్నే ఓవర్ షూట్ అంటారు.

సాధారణ రన్ వేలలో ఇలా జరిగినప్పుడు.. విమానం ఆగటానికి తగినంత స్థలం ఉంటుంది. కానీ.. టేబుల్ టాప్ రన్ వేల మీద ఓవర్ షూట్ జరిగతే.. విమానం నేరుగా లోయ లాంటి ప్రదేశంలో పడిపోతుంది. నేపాల్ లో ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేల కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. మన దేశంలోనూ ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలు ఐదుచోట్ల ఉన్నాయి.

1. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా

2. కేరళలోని కోజికోడ్

3. కర్ణాటకలోని మంగళూరు

4. మిజోరంలోని లెంగ్ పుయ్

5. సిక్కింలోని పాక్యాంగ్

కొవిడ్ సంవత్సరంలో (2020)లో దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన కోజికోడ్ విమాన ప్రమాదం జరిగింది కూడా ఈ టేబుల్ టాప్ రన్ వే కారణంగానే. కొవిడ్ వేళ వందేభారత్ మిషన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ కు చేరుకోవటం.. అది ల్యాండ్ అవుతున్నప్పుడు అదుపు తప్పి రన్ వే నుంచి జారి 35 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు.. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వమానంలో 190 మంది ఉండటం తెలిసిందే. 2010 మే 22న కూడా దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన ఎయిర్ ఇండియాఎక్స్ ప్రెస్ విమానం సైతం ప్రమాదానికి గురి కాగా.. 158 మంది మృత్యువాత పడ్డారు.