తాడేపల్లి ప్రక్షాళన - నేతల నినాదం - జగన్ సీరియస్..!
గత రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్.. పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు.
By: Tupaki Desk | 14 Sep 2024 3:35 AM GMTతాడేపల్లిని ప్రక్షాళన చేయాలంటూ.. మెజారిటీ నాయకులు పోరుపెడుతున్నారు. తాడేపల్లిలో తిష్టవేసిన కొందరు సలహాదారులు.. గతంలో పార్టీకి పనిచేసి.. తర్వాత.. సలహాదారులగా మారిన వారు.. మరికొందరు ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపించని నాయకులను ప్రక్షాళన చేయాలన్నది నాయకుల డిమాండ్‌గా ఉంది. గత రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్.. పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు. బుధ, గురువారాల్లో జరిగిన పలు చర్చల్లో నాయకులు ముక్తకంఠంతో ప్రక్షాళన పాట పాడినట్టు తెలిసింది.
''వాళ్లు-వీళ్లు చెప్పడం కాదు.. మీరే క్షేత్రస్థాయికి రండి. అసలు మేం ఎలా ఉన్నామో.. ఏం చేస్తున్నామో చూడండి'' అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. అయితే.. ముందునువ్వు కుటుంబ వ్యవ హారాలు చూసుకో అని జగన్ సలహా ఇచ్చినట్టు తెలిసింది. పార్టీకి ఇబ్బందులు రాకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఇక, ఇదే విషయంపై కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు కూడా చెప్పారు. అయితే.. ఈ విషయంపై జగన్ మౌనంగా ఉన్నట్టు తెలిసింది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ పరిస్థితి ఎలా ఉందని జగన్ అడిగితే.. మెజారిటీ నాయకులు.. ఏం బాలేదని.. మరికొందరు మాత్రం.. ఫర్వాలేదని సమాచారం ఇచ్చారు. అయితే.. కేడర్ ఇప్పుడు భయాందోళనలో ఉన్నట్టుగా ఎక్కువ మంది చెప్పడం గమనార్హం. తమపై ఎక్కడ కేసులు పెడతారోనని కేడర్ భయపడుతోందని.. వారికి మనోధైర్యం నింపేలా.. మీరు పర్యటించాలని మరికొందరు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని ఎక్కవగా సూచనలు వచ్చాయి.
ఇదే సమయంలో సూపర్ సిక్స్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ప్రజలు వేచి చూస్తున్నారని.. మహిళలకు రూ.1500 ఇస్తామని కూడాఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోందని.. కోస్తాకు చెందిన మాజీ మంత్రి ఒకరు చెప్పారు. అయితే.. ఇప్పుడు దానిని తెరమీదికి తీసుకువచ్చినా.. ప్రయోజనం లేదని.. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఫోకస్ చేస్తే.. మంచిదని సూచించారు. అయితే.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. ముందు పార్టీకి ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు అయితే.. జగన్‌ను చుట్టుముట్టాయి.