పార్టీకి గోవాకు వెళ్లి హత్యకు గురైన తాడేపల్లిగూడెం యువకుడు
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొంత జాగ్రత్తతో పాటు అప్రమత్తత అవసరం. ఆ విషయాల్లో జరిగే తప్పులు ప్రాణాలు తీస్తుంటాయి.
By: Tupaki Desk | 3 Jan 2025 5:17 AM GMTకొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొంత జాగ్రత్తతో పాటు అప్రమత్తత అవసరం. ఆ విషయాల్లో జరిగే తప్పులు ప్రాణాలు తీస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. కొత్త సంవత్సర వేడుకుల కోసం గోవాకు వెళ్లిన ఐటీ ఉద్యోగుల టీం.. అక్కడ జరిగిన ఒక గొడవలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఉదంతమిది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 26 ఏళ్ల బొల్లా రవితేజ ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏడుగురు స్నేహితులు కలిసి గోవాకు వెళ్లారు. గత శనివారం వారు గోవాకు చేరుకొని.. సోమవారం రాత్రి కలంగుట్ బీచ్ లో సరదాగా గడిపారు. అనంతరం పక్కనే ఉన్న మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లారు. అయితే.. అక్కడ ఫుడ్ చాలా ఖరీదు ఉండటంతో.. ఇదే విషయాన్ని వీరితో పాటు వెళ్లిన ఒక యువతి సదరు షాప్ ఓనర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని కొడుకు సుబెట్ సిల్వేరా ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో.. అతడి తీరును ప్రశ్నించటంతో అది కాస్తా ఘర్షణగా మారింది. రెస్టారెంట్ లో పని చేసే కొందరు రవితేజను కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు తీవ్రంగా గాయం కావటంతో రవితేజ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రవితేజ డెడ్ బాడీని సొంతూరుకు పంపేందుకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని.. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు తెప్పించారు. అక్కడి నుంచి తాడేపల్లిగూడెంలోని వారి నివాసానికి చేర్చారు. సరదాగా ఎంజాయ్ చేసేందుకు స్నేహితులతో వెళ్లిన రవితేజ.. మరణించిన వైనాన్ని అతడి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక.. రవితేజ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.