వైసీపీ కార్యాలయం కూల్చివేత.... అసలు దీని వెనుక ఏం జరిగింది?
అయితే.. ఈ స్థలాన్ని వైసీపీ అనధికారికంగా లీజుకు తీసుకున్నట్టు తెలిసింది. టీడీపీ కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత.. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు వైసీపీకి నోటీసులు జారీ చేశారు.
By: Tupaki Desk | 22 Jun 2024 6:29 AM GMTవైసీపీ అధినేత జగన్ నివాసానికి అత్యంత సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అధికారులు కూల్చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల యానికి కూతవేటు దూరంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడే పార్టీ కోసం పెద్ద భవన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే.. అప్పట్లో ఎవరికీ తెలియకుండానే ఈ పనులు చేపట్టారు. మీడియా సైతం ఈ పనులను పసిగట్టలేక పోయింది.
ఎలా బయటకు వచ్చింది?
ఎన్నికలకు ముందు.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఇంటింటి ప్రచారం చేసిన సమయంలో కొందరు ఆయనకు ఈ విషయాన్ని రహస్యంగా చెప్పారు. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని పరిశీలించిన నారా లోకేష్.. సంబంధిత పత్రాలను తన పార్టీ వారి ద్వారా సేకరించి పెట్టుకున్నారు. వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్న ప్రాంతం చెరువు అని తేలింది. పైగా.. ఇది నీటి పారుదల శాఖ స్థలమని గుర్తించారు. బోట్ యార్డుగా(నావలను ఇక్కడ ఉంచుతారు) ఉపయోగిస్తున్న స్థలమని అధికారులు తెలిపారు.
అయితే.. ఈ స్థలాన్ని వైసీపీ అనధికారికంగా లీజుకు తీసుకున్నట్టు తెలిసింది. టీడీపీ కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత.. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు వైసీపీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై వెంటనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. కాగా, దీనిపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంత స్థలం?
తాడేపల్లిలోని 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమి ఇది. దీనికి పక్కన మరో 14-18 ఎకరాల స్థలం ఉంది. దీనిని ప్రస్తుతానికి ముట్టుకోలేదు. కానీ, భవిష్యత్తులో సొంతం చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆ భూమిని కూడా.. వైసీపీ వినియోగించుకునే అవకాశం ఉండేదన్నది టీడీపీ నేతల ఆరోపణ.