రేవంత్ అజ్ఞాని: బీఆర్ ఎస్ మాజీ మంత్రి కామెంట్స్ రీజనేంటి?
ఇక, తాజాగా మీడియాతో మాట్లాడిన రాజయ్య.. సీఎంకు పిచ్చిపట్టిందని.. ఆయన అజ్ఞానిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ''రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నడు.
By: Tupaki Desk | 16 Oct 2024 9:30 PM GMTతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ ఎస్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే(స్టేషన్ ఘన్‌పూర్) తాడికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి అజ్ఞాని' అని అన్నారు. అయితే.. ఉన్నట్టుండి ఇలా విరుచుకుపడడం వెనుక రాజకీయాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ ఎస్‌తో కొన్నాళ్ల కిందట విభేదించిన రాజయ్య..(ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం) అప్పట్లోనే కాంగ్రెస్‌లోకి రావాలని భావించారు. అయితే.. దీనికి కొందరు అడ్డుపడ్డారు. ఆ తర్వాత నేరుగా ఆయన సీఎం ను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది కూడా వర్కవుట్ కాలేదు.
ఈ కారణంగానే రాజయ్య.. ఇప్పుడు ఎదురుతిరిగినట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, తాజాగా మీడియాతో మాట్లాడిన రాజయ్య.. సీఎంకు పిచ్చిపట్టిందని.. ఆయన అజ్ఞానిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ''రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నడు. ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదు'' అని అన్నారు. అంతేకాదు.. ''దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి, హైదరాబాద్‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి చెబుతున్నాడు. ఇదేం మాటలో అర్థమైతలేదు'' అని రాజయ్య తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
అందుకే ఫిరాయింపులు
సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రాజయ్య వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ నుంచి నాయకులను తీసు కువెళ్తున్నాడని.. దీనికి కారణం.. పాలన చేతకాకపోవడమేనని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనుకబడి పోయారని, వాటిని ప్రశ్నించకుండా రాజకీయ పార్టీలను అడ్డుకుని..పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ''పాలనపై పట్టులేదు. పార్టీపై పట్టు లేదు. ఎవరైనా ఒక్కరైనా ఆయన మాట వింటున్నరా? అందుకే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నడు'' అని రాజయ్య చెప్పుకొచ్చారు.
కాగా, రాజయ్య వ్యాఖ్యల వెనుక.. వేరే ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా రాజయ్య తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని.. బీఆర్ ఎస్ ఆయనను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అనుకున్నా.. నో ఎంట్రీ బోర్డు పెట్టారని అందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా వ్యూహాత్మకంగా రాజయ్య ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.