Begin typing your search above and press return to search.

తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్‌!

తాజాగా తాడిపత్రిలో ఉన్న జూనియర్‌ కాలేజీలో ప్రభుత్వం పనులు చేస్తుంటే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అడ్డుకుని కట్టడాలను కూల్చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 10:22 AM GMT
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్‌!
X

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. అక్కడ తరచూ మున్సిపాలిటీ చైర్మన్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తరచూ ఇరు పార్టీలు ఒకరిపై మరొకటి దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం రివాజుగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు గాయపడుతున్నారు.

తాజాగా తాడిపత్రిలో ఉన్న జూనియర్‌ కాలేజీలో ప్రభుత్వం పనులు చేస్తుంటే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అడ్డుకుని కట్టడాలను కూల్చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. అలాగే మరో 13 మంది జేసీ అనుచరులపై తాడిపత్రి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్‌ కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ కి చెందిన 53 పిల్లర్లను నాశనం చేసి.. గుంతలు పూడ్చేశారంటూ వైసీపీ నాయకుడు గురు శంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురు శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ ప్రభాకర్‌ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 13 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. జేసీ నివాసం చుట్టూ భారీ కేడ్లను అడ్డం పెట్టి ఆయన అనుచరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు.

ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, భారీగా స్పెషల్‌ పార్టీ పోలీస్‌ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జూనియర్‌ కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో తాడిపత్రిలో హై టెన్షన్‌ నెలకొంది. తాడిపత్రి పట్టణంలో 30 యాక్టు అమలులో ఉంది. ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండకూడదని పోలీసులు తెలిపారు. అలాగే నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా తాడిపత్రి అంటే ఒక ఊరు మాత్రమే కాదని అది తన నియోజకవర్గం, తన కుటుంబమని జేసీ ప్రభాకర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. అటువంటి తాడిపత్రికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏం చేశారు? అని నిలదీశారు. భూ కబ్జాలు చేయటం తప్ప ఏం చేస్తాడు..? అని ప్రశ్నించారు. పెద్దారెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని జేసీ విమర్శించారు. తాడిపత్రిలో రూ.2 కోట్ల రూపాయలు విలువ చేసే మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి ఇంకా అధికారం ఎనిమిది నెలలు ఉందన్నారు. పెద్దారెడ్డి అరాచకాలకు చరమగీతం పలికి తరిమికొడతామన్నారు.