26/11 ముంబై దాడుల కేసుల్లో తహవూర్ రాణాకు బిగ్ షాకిచ్చిన యూఎస్!
నవంబర్ 25 - 2008న ముంబైలో ఉగ్రమూకలు భీకర దాడి జరిపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Aug 2024 11:30 AM GMTనవంబర్ 25 - 2008న ముంబైలో ఉగ్రమూకలు భీకర దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఈ ప్రకంపణలు ప్రపంచ దేశాలనూ తాకిన పరిస్థితి! అయితే ఈ దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాకు బిగ్ షాక్ తగిలింది. ఇతడిని భారత్ కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.
అవును.. 26/11 ముంబై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం కెనడాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఇతడు.. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. అయితే.. ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడనే ఆరోపణలు ఇతడు ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో రాణాను తమకు అప్పగించాలని భారత్ అభ్యర్థన చేసింది. దీనికి అనుకూలంగా గత ఏడాది కాలిఫోర్నియా జిల్లా ఆదేశాలు ఇచ్చింది. దీంతో.. వీటిని సవాల్ చేస్తూ రాణా... ది రైటాఫ్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో అతడు చేసిన అపీల్ పై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా అతడు దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ధృవీకరించింది. భారత్ - యూఎస్ మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగానే కాలిఫోర్నియా జిల్లా ఆదేశాలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో 26/11 ముంబై దాడుల కేసుకు సంబంధించి ఇతడిపై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలను భారత్ అందించిందని ప్యానెల్ పేర్కొంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో శిక్ష అనుభవిస్తున్న రాణా.. ఈ ఆదేశాలను సవాల్ చేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... ముంబైలో ఉగ్రమూకలు జరిపిన భీకరదాడిలో సుమారు 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలతో పాటు.. ప్రధాన నిందితుడు డేవిడ్ హెడ్లీకి ఇతడు అత్యంత స్నేహితుడని అంటున్నారు. ఈ దాడులకు ముందు ముంబైలో రెక్కీ నిర్వహించింది కూడా ఇతడే అని విచారణలో భాగంగా హెడ్లీ గతంలో వెల్లడించాడు!
అయితే... ఇలా ఉగ్రదాడులకు రెక్కీలు నిర్వహించడం, సహాయం చేయడం రాణాకు ఇదే తొలిసారి కాదు. మరోకేసులోనూ ఇలాంటి సహాయ సహకారాలు చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఇతడు లాస్ ఏజెల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడిని భారత్ కు అప్పగించొచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.