Begin typing your search above and press return to search.

రాష్ట్ర ఎన్నికలను కుదిపేస్తున్న టైలర్ హత్య.. ప్రధాని, సీఎం అదే మాట

ఇక ఎన్నికల సమయంలో మరింతగా ముదురుతున్న గొడవలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 7:51 AM GMT
రాష్ట్ర ఎన్నికలను కుదిపేస్తున్న టైలర్ హత్య.. ప్రధాని, సీఎం అదే మాట
X

ఒక రాష్ట్ర రాజకీయాలను సాధారణ టైలర్ (దర్జీ) హత్య కుదిపేస్తోంది.. అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద వివాదాస్పద అంశమైంది. సాక్షాత్తు దేశ ప్రధాని మోదీనే ఆ టైలర్ హత్య గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడే కాదు.. మూడు నెలల కిందటే ఆయన దర్జీ హత్యపై మాట్లాడారు. ఇక ఎన్నికల సమయంలో మరింతగా ముదురుతున్న గొడవలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే.. కేవలం దర్జీ హత్యకు ఇంత రగడ ఏమిటా అని అనిపిస్తోందా?

వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు తెలిపి

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ ఓ సాధారణ టైలర్. నిరుడు బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అతడు సోషల్ మీడియాలో మద్దతు పలికాడు. దీంతో పలు సంస్థల నుంచి బెదిరింపులకు గురయ్యాడు. పోలీసులు కన్హయ్యను అరెస్టు కూడా చేశారు. బెయిల్ పై విడుదలైన అతడిని 2022 జూలై 28న దారుణంగా హత్య చేశారు. అది కూడా టైలర్ షాప్ లో ఉండగా ఇద్దరు దుండగులు సాధారణ వినియోగదారుల్లా వచ్చి అతి దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌ తో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గంటల్లోనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

హంతకులు ఇతర వర్గం వారా?

కన్హయ్యను హత్య చేసింది వేరే వర్గం వారు కావడంతో విషయం మతపరమైన రంగు పులుముకుంది. దాదాపు నాలుగైదు నెలల కిందటే రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. కన్హయ్య లాల్ హత్య గురించి ప్రస్తావించారు. కన్హయ్య హంతకులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని తప్పుబట్టారు. గురువారం సైతం ఉదయ్‌ పూర్‌ ప్రచారంలో కన్హయ్య హత్య గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తుండటం వల్లే ఆ హత్య జరిగిందని గహ్లోత్ సర్కారును దుయ్యబట్టారు. కాగా, ఇదే అంశానికి సంబంధించి సీఎం అశోక్‌ గహ్లోత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంపింది బీజేపీవారేనంటున్న సీఎం

మోదీ విమర్శలపై గెహ్లెత్ స్పందిస్తూ.. కన్హయ్యను చంపేసిన హంతకులకు బీజేపీతో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కన్హయ్య హత్యను ఖండిస్తూనే, ఆ ఘటన గురించి తెలియగానే నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఉదయ్‌ పుర్‌ వెళ్లిన సంగతిని గుర్తుచేశారు. ఎన్‌ఐఏ ఏం చర్యలు తీసుకుందో ఇప్పటివరకు తెలియదన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడో తేల్చేసేవారమని ప్రకటించారు. కాగా, కన్హయ్య హత్య కేసు నిందితులు అంతకుముందు వేరే కేసులో అరెస్టయ్యారని.. బీజేపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి మరీ వారిని విడిపించుకు వెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తానికి సాధారణ దర్జీ హత్య కేసు ఒక రాష్ట్ర రాజకీయాలకు కీలక అంశమైంది. ప్రధాని, సీఎం నోరు తెరిచి ప్రస్తావించేంత వ్యవహారమైంది.