పాతికేళ్లలో అతి పెద్ద భూకంపం.. ఆ దేశాల్లో సునామీ వార్నింగ్
పెద్ద ఎత్తున బిల్డింగ్ లు ధ్వంసమయ్యాయి. ఒక ఐదు అంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 3 April 2024 4:35 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతికేళ్ల తర్వాత అత్యంత తీవ్రమైన భూకంపం తాకిడికి తైవాన్ విలవిలలాడింది. దీని ప్రభావంతో తైవాన్ తో సహా జపాన్ దక్షిణ ప్రాంతం సైతం ప్రభావితమైంది. రిక్టర్ స్కేల్ లో ఈ భూకంప తీవ్రతను7.2 గా గుర్తించారు. అమెరికా జియలాజికల్ సంస్థ మాత్రం దీన్ని 7.4గా పేర్కొన్నారు.
తైవాన్ లోని హువాలియెన్ పట్టణానికి నైరుది దిశలో 18 కిలోమీటర్ల దూరం.. 35కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ భూకంపం తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లుగా చెబుతున్నారు. భూకంప కేంద్రం హువాలినన్ లో తీవ్రత భారీగా ఉంది. అక్కడి భవనాలు పునాదులు కూడా కదిలాయి. రాజధాని తైపీలో భూకంపం సంభవించింది.
ఈ భూకంపం నేపథ్యంలో 9.8 అడుగుల మేర సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. మొదటి అల మియాకో.. యాయామా దీవుల తీరాల్ని తాకినట్లుగా చెబుతున్నారు. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున తైవాన్ లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం ధాటికి ద్వీపం మొత్తం కంపించింది. భవనాలు కూలిపోయాయి. మరోవైపు జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ రాకాసి అలల తైవాన్ తూర్పు తీరంలోని హువాలియోన్ పట్టణాన్ని తాకాయి.
పెద్ద ఎత్తున బిల్డింగ్ లు ధ్వంసమయ్యాయి. ఒక ఐదు అంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ లోని కొన్ని దీవుల్లోనూ తాజా భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు.
భూకంపం కారణంగా విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఫిలిప్పీన్స్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా భూకంపం తాకిడికి పెద్ద ఎత్తున భవనాలు కూలిపోయాయి. స్పీడ్ రైలు సర్వీసుల్ని నిలిపివేశారు. అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ నుంచి జనం బయటకు వస్తున్నారు. పాతికేళ్ల తర్వాత చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన భూకంపంగా అభివర్ణిస్తున్నారు. భూకంపం కారణంగా తైపీ.. తైచుంగ్.. కాహ్ సియుంగ్ లలో మెట్రోను నిలిపివేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదంటే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలన్న సూచనలు చేస్తున్నారు.