తైవాన్‌పై కాలు దువ్వితే.. చైనాకే ప్రమాదం.. 'కిల్ స్విచ్' ఆన్ చేస్తామన్న టెక్ సంస్థలు
అందుకే అగ్రరాజ్యాలతో తైవాన్ బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 22 May 2024 3:00 AM GMTతైనాన్‌ను ఆక్రమించుకునేందుకు కోసం తహ తహ లాడుతున్న డ్రాగన్ కంట్రీ.. చైనా. ఎప్పటి నుంచో తైవాన్ ను తమ భూభాగం గా ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సమయంలో అయినా.. చైనా తైవాన్‌ను ఆక్రమించుకునే అవకా శం ఉందని.. గత మూడేళ్లుగా అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. తైవాన్.. కూడా చైనా దూకుడును ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ.. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే అగ్రరాజ్యాలతో తైవాన్ బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది.
ఇదిలావుంటే.. ఒకవైపు ప్రపంచ దేశాల సహాయం తీసుకుంటూనే.. మరో వైపు అంతర్గతంగా కూడా.. తైవాన్ దేశం.. చైనాను నిలువరించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో 'కిల్ స్విచ్' అనే సాంకేతికతను తైవాన్ టెక్ సంస్థలు రెడీ చేసుకున్నాయట. తైవాన్.. దేశం.. చిప్‌ల ప్రశిద్ధి. ఇప్పుడు ఫోన్ల నుంచి ఇతర సాంకేతిక పరికరాల వరకు కూడా.. చిప్‌ల వినియోగం తప్పని సరి. దీంతో తైవాన్ ప్రపంచంలోనే చిప్‌ల తయారీలో ముందుంది. ఈ నేపథ్యమే.. తైవాన్ ఆక్రమించు కోవాలన్న చైనా కాంక్షను మరింత పెంచేసింది.
అయితే.. తైవాన్ కూడా..ఇదే చిప్‌లను వినియోగించి.. చైనాకు బంధం వేయాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ఏదైనా సమయంలో చైనా కనుక తైవాన్‌పై కాలు దువ్వితే.... సైనికులతో బల ప్రయోగం చేస్తే.. వెంటనే 'కిల్ స్విచ్'ను నొక్కడం ద్వారా.. ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు డిజేబులైపోయేలా తైవాన్ టెక్ కంపెనీలు ఏర్పాట్లు చేశాయని తెలిసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంలోని ఇద్దరు అధికారుల ద్వారా తెలిసినట్టు ప్రఖ్యాత 'బ్లూమ్‌బెర్గ్' మీడియా వెల్లడించింది.
ఏం జరిగింది?
కొన్నాళ్ల కిందట.. నెదర్లాండ్స్(డచ్), తైవాన్(ఈ రెండు చిప్‌ల తయారీలో అగ్రగామి సంస్థలు)దేశాల టెక్ సంస్థలతో అమెరికా భేటీ అయింది. ఈ సమయంలో చైనా దురాక్రమణ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డచ్‌కు చెందిన ఏఎస్‌ఎంఎల్ అధికారులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితి వస్తే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిల్ స్విచ్ నొక్కుతామని చెప్పారు. దీంతో తక్షణమే అత్యాధునిక చిప్ యంత్రాలను రిమోట్ విధానంలో డిజేబుల్ అయిపోతాయని వెల్లడించారు. అయితే.. ఇదంతా కూడా అత్యంత రహస్యంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
చిప్‌ల తయారీకి ఏఎస్‌ఎంఎల్‌కు చెందిన ఎక్స్‌ట్రీమ్ అల్ట్రావైలెట్ మిషిన్లను వినియోగిస్తారు. ఇది బస్సు సైజులో ఉంటాయి. అయితే.. తరచుగా వీటికి సర్వీసింగ్ చేస్తారు. అదేవిధంగా కాలానుగుణంగా అప్ డేట్ వెర్షన్లను కూడా మారుస్తారు. ఈ సమయంలోనే కంపెనీలు.. వాటిని రిమోట్ స్విచ్(కిల్ స్విచ్)తో నిలిపివేస్తాయి. ప్రస్తుతం చైనాకు చిప్ తయారీ యంత్రాలు లేని విషయం తెలిసిందే. అమెరికా ఆదేశాల మేరకు.. చైనాకు ఎవరూ ఈ యంత్రాలను ఇవ్వలేదు. ఇక, ఇదే విషయంపై గతేడాది సెప్టెంబర్‌లో టీఎస్‌ఎంసీ చీఫ్ మార్క్ ల్యూ మాట్లాడుతూ.. కంపెనీ చిప్ మేకింగ్ యంత్రాలు పనిచేయకుండా చేసేందుకు ఒక విధానాన్ని సిద్ధం చేశామన్నారు.