చైనాకు షాకిచ్చేలా తైవాన్ ప్రజల ఎన్నికల తీర్పు
చైనాను వ్యతిరేకించే అధికార పార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మూడోసారి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 14 Jan 2024 5:17 AM GMTచైనాతో పంచాయితీ అంతకంతకూ ముదురుతున్న వేళ.. తైవాన్ భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో చైనాను వ్యతిరేకించే అధికార పార్టీకి మరోసారి పాలనా పగ్గాలు అందేలా తైవాన్ ప్రజలు తీర్పు ఇచ్చారు. శనివారం సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు షురూ చేశారు.
చైనాను వ్యతిరేకించే అధికార పార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మూడోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. కరడుగట్టిన జాతీయవాదిగా పేరున్నడీపీపీ అభ్యర్థి లైచింగ్ టె కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తైవాన్ ప్రజల తీర్పు చైనాకు ఇబ్బందిని కలిగించేదిగా చెప్పాలి. శనివారంఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షుడైన లై నలబై శాతం ఓట్లతో విజయం సాధించారు.
చైనా అనుకూల ప్రధాన విపక్షమైన కొమింటాంగ్ పార్టీ అభ్యర్థి హో యుఈ 33 శాతం ఓట్లతో ఓటమి పాలయ్యారు. మరో విపక్ష పార్టీ తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి సైతం ఓటమిపాలయ్యారు. ఆ పార్టీకి 26 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. గడిచిన ఎనిమిదేళ్లుగా తైవాన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న తైఇంగ్ వేన్ చైనా పట్ల అనుసరించిన దూకుడు విధానాల్ని తాజాగా ఎన్నికైన లై ముందుకు తీసుకెళతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా తైవాన్ ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు నేపథ్యంలో.. తైవాన్ ద్వీపం చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తైవాన్ కు అగ్రరాజ్యం అమెరికా దన్నుగా నిలవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేదని.. తైవాన్ మీద ఒత్తిడి తీసుకురావటం ఖాయమని.. ఈ పరిణామాలు మరిన్ని ఉద్రిక్తతలకు కారణమవుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో విజయం సాధించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. పార్లమెంటులో మాత్రం విపక్షం స్వల్ప అధిక్యతను ప్రదర్శించింది. 113 స్థానాలకు 51 స్థానాలకు అధికార డీపీపీ పరిమితమైతే.. విపక్ష కేఎంటీ మాత్రం 52 స్థానాల్లో నెగ్గింది. మరో పార్టీ (టీపీపీ) 8 సీట్లను సొంతం చేసుకుంది. అధ్యక్ష పీఠంపై చైనా వ్యతిరేక పార్టీ..పార్లమెంటులో మాత్రం చైనా అనుకూల పార్టీకి అధిక్యత లభించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.