బీఆర్ఎస్ సమావేశానికి తలసాని ఎందుకు డుమ్మా కొట్టారో తెలుసా?
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కష్టాలకు ఎదురీదుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు.
By: Tupaki Desk | 18 April 2024 2:22 PM GMTప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కష్టాలకు ఎదురీదుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. దీంతో అంతర్మథనంలో పడుతోంది. నేతలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు గైర్హాజరు కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలియడంతో అధినేత కేసీఆర్ లో భయం పట్టుకుంటోంది. పార్టీ మొత్తం ఖాళీ అవుతుందేమోననే బెంగ వేధిస్తోంది. ఈనేపథ్యంలో నేతల వలస బాటకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. భవిష్యత్ మనదే అనే ధీమా కలిగించడంలో వెనకడుగు వేస్తున్నారు. అందుకే నేతలు వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కవిత అరెస్ట్ తో నేతల్లో విశ్వాసం సన్నగిల్లింది. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కాంగ్రెస్ వాదనలతో బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని చెబుతున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నట్లు సమాచారం.
గురువారం జరిగిన సమావేశానికి తలసాని రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడితే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పరిస్థితికి అందరు జంకుతున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన.