Begin typing your search above and press return to search.

'తల'సాని నిండా మునగడం ఖాయమేనా?

2014లో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017లో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Feb 2024 1:22 PM GMT
తలసాని నిండా మునగడం ఖాయమేనా?
X

2014లో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017లో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇటీవల అధికారంలో ఉన్నంతవరకు 4.25 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది. ఇందుకోసం లబ్ధిదారుల వాటా పోనూ రూ.3,386 కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంది.

అయితే కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పథకంలో భారీ ఎత్తున నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే 2017–18లో వెటర్నరీ శాఖకు చెందిన 40 మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. అయితే నామమాత్రంగానే చర్యలు చర్యలు చేపట్టారు. కొందరిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ సమయంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీగా పనిచేసిన ఉన్నతాధికారిపై కూడా అభియోగాలు వచ్చాయి.

అంతేకాకుండా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేషీలోని అధికారుల పాత్ర ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. అప్పట్లో అధికారులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం ఆ తర్వాత కొద్దిరోజులకే వారిపై చర్యలను ఉపసంహరించుకుంది. నిధులు రికవరీ, శాఖాపరమైన చర్యలు కూడా చేపట్టలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా నాటి గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కాగ్‌ తన నివేదికను బయటపెట్టడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ పథకంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాగ్‌ ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలి మూడేళ్లలో (2017–20 మధ్య) భారీగా అవినీతి, అక్రమాలు జరగటం, కేసులు కూడా నమోదు కావటం, తాజాగా ‘కాగ్‌’ నివేదిక వెలువడిన నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ పథకానికి ఇతర రాష్ట్రాల్లో గొర్రెల ఎంపిక, రవాణా, లబ్ధిదారులకు అప్పగింతలో భారీగా అక్రమాలు జరిగాయనే అభియోగాలు ఉన్నాయి.