బంజారాహిల్స్ లోని ఈ గబ్బు పబ్ గురించి తెలిస్తే షాకే
పోలీసు వర్గాలు అందిస్తున్న సమచారం ప్రకారం బంజారాహిల్స్ లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్ మీద శుక్రవారం అర్థరాత్రి వేళలో టాస్కు ఫోర్సు పోలీసులు దాడులు చేశారు.
By: Tupaki Desk | 19 Oct 2024 10:34 AM GMTబంజారాహిల్స్ లోని ఒక పబ్ లో కొత్తతరహా భాగోతం బయటకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్న వైనంపై పక్కా సమాచారాన్ని అందుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో వంద మంది పురుషులు.. 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాలు అందిస్తున్న సమచారం ప్రకారం బంజారాహిల్స్ లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్ మీద శుక్రవారం అర్థరాత్రి వేళలో టాస్కు ఫోర్సు పోలీసులు దాడులు చేశారు.
పబ్ కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్ కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్సులు చేయిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి.. ఎక్కువ బిల్ అయ్యేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కస్టమర్ల చేత మందు తాగించే డ్యాన్సర్లు.. తాము మాత్రం కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతారు. దీనికి సంబంధించిన పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు వారాలుగా రెక్కీ నిర్వహిస్తున్నారు.
తాజాగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా వంద మంది కస్టమర్లు.. 42 మంది యువతులు.. ఏడుగురు పబ్ నిర్వాహకుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి.. విచారణ చేపట్టారు. మద్యానికి బానిసలు అయ్యేలా యువకుల్ని ట్రాప్ చేసి వారి నుంచి డబ్బులు దండుకోవటమే ఈ పబ్ వ్యవహారంగా చెబుతున్నారు. దీంతో.. యూత్ పబ్ కల్చర్ నుంచి మారాలన్న సూచన పోలీసులు చేయటం గమనార్హం.