దేశంలో ఎత్తైన భవనాల నిర్మాణంలో హైదరాబాద్ ప్లేస్ ఇదే!
దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉందని.. పలు విషయాల్లో ఉన్నత స్థానాలను అదిరోహిస్తుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Aug 2024 8:30 AM GMTదేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉందని.. పలు విషయాల్లో ఉన్నత స్థానాలను అదిరోహిస్తుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హైటీ, రియల్ ఎస్టేట్, హాస్పటల్స్ మొదలైన రంగాల్లో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అంటారు. ఈ సమయంలో హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం లభించింది.
అవును... గత కొంతకాలంగా పలు రంగాల్లో హైదరాబాద్ నగరం పేరు మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా హైదరాబాద్ కి మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఎత్తైన భవనాల నిర్మాణంలో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని అంటున్నారు. ఈ మేరకు ఐజీబీసీ వైఎస్ ఛైర్మన్ ఈ విషయాలు వెల్లడించారు.
కాన్ ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో మూడు రోజుల ప్రాపర్టీస్ షోను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నేషనల్ వైఎస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి.. హైదరాబాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర నగరాలు ఈర్ష్య పడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్లోబల్ బ్రాంద్లు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, ఇది సాకారమైతే హైదరాబాద్ స్వరూపం మారిపోతుందని తెలిపారు.
ఇదే క్రమంలో... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పిన శేఖర్ రెడ్డి.. భవన నిర్మాణ అనుమతులు, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్.ఓ.సీ) జారీ ప్రక్రియ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
ఇదే సమయంలో... రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ ను ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారి అపోహలు తొలగిపోయాయని.. హైదరాబాద్ లో ఉన్న అభివృద్ధి మిగతా నగరాల్లో కనిపించడం లేదని.. ఎత్తైన భవన నిర్మాణాం హైదరాబాద్ ల్యాండ్ స్కేప్ ను పూర్తిగా మార్చేసిందని క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ రాంరెడ్డి చెప్పారు.
అదేవిధంగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ హైదరబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతుందని.. "బ్రాండ్ హైదరాబాద్" ప్రపంచంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న 4వ నగరం గా గుర్తింపు పొందిందని.. ఈ మేరకు నైట్ అండ్ ఫ్రాంక్ - బీఐఐ తన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
ఈ క్రమంలోనే మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2023 ప్రకారం ఇండియాలో నివసించడానికి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ దాని జీవన నాణ్యతకు ప్రత్యేకంగా నిలుస్తుందని క్రెడాయ్ హైదరాబాద్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జైదీప్ రెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేట్లకు అట్రాక్టివ్ సిటీగానే కాకుండా, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ వైద్య సేవలతో అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ రేటింగ్ దక్కించుకుందని తెలిపారు!