జగన్‌ను గుర్తు చేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే..!
వైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు మరిచిపోవాలని.. ఎక్కడికి వెళ్లినా.. తామే గుర్తుండాలని.. ప్రత్యర్థి పార్టీగా టీడీపీ భావిస్తుంది.
By: Tupaki Desk | 4 April 2025 9:30 AMవైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు మరిచిపోవాలని.. ఎక్కడికి వెళ్లినా.. తామే గుర్తుండాలని.. ప్రత్యర్థి పార్టీగా టీడీపీ భావిస్తుంది. ఇక, గతంలో జగన్ కూడా ఇదే తరహా రాజకీయం చేశారు. అన్న క్యాంటీన్లు ఎత్తేశారు. రాజధానిని మార్చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. అదేవిధంగా అనేక పథకాలను కూడా ఎత్తేశారు. అయితే.. అప్పట్లో ప్రజలు.. వీటిని తీసేసినా.. పెద్ద గా పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.
ప్రజలు ఏ విషయాలనైతే.. మరిచిపోయారో.. మరిచిపోయేలా వైసీపీ చేస్తోందో.. అలాంటి వాటినే తట్టి లేపారు. ప్రజల్లోకి విస్తృతంగా వాటిని తీసుకువెళ్లి.. తమ పేరును, తమ ప్రభుత్వంలో చేసిన వాటిని నిలబెట్టు కునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇప్పుడు వైసీపీ పేరు ప్రజల మధ్య వినిపించకూడదని కూటమి ప్రభుత్వంలోని పార్టీలు చెబుతున్నా.. భావిస్తున్నా.. ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా.. వైసీపీని ఎవరూ మరిచిపోయేలా కనిపించడం లేదు. జగన్‌ను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నారు.
తాజాగా ప్రతిష్టాత్మక ఎన్నికల హామీ అయిన.. `తల్లికి వందనం` పథకానికి సంబంధించి ప్రబుత్వం కొన్ని లీకులు ఇచ్చింది. ఈ పథకాన్నిఎవరవరికి వర్తింప జేయాలని భావిస్తున్నదీ పేర్కొంది.అయితే.. ఈ సమాచారంలో పేర్కొన్న వివరాలను చూస్తే... జగన్ హయాంలో అమలు చేసిన `అమ్మ ఒడి` పథకానికి పెట్టిన నిబంధనలే కావడం గమనార్హం. అప్పట్లో ఈ నిబంధనలను తోసిపుచ్చి.. తాము వస్తే.. అందరికీ ఈ పథకాన్నిఅమలు చేస్తామని చెప్పిన కూటమి నేతలు..ఇప్పుడు మళ్లీ జగన్ పెట్టిన నిబంధనల ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తామనిచెప్పడంతో జగన్ పేరును ప్రజలు మరిచిపోకుండా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలలో 'తల్లికి వందనం' ఒకటి. ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అందింది. 81 లక్షల మంది విద్యార్థులకు గానూ.. 69.16 లక్షల మందిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారిని ఈ పథకానికి అనర్హులుగా తేల్చినట్లు తెలిసింది. జగన్ హయాంలోనూ ఇవే నిబంధనలు పెట్టారు. ఇప్పుడు కూటమి కూడా ఇవే పాటిస్తోంది. మరి తేడా ఏంటన్నది కూటమి పాలకులే చెప్పాలి.