Begin typing your search above and press return to search.

హిందీ వల్ల 25 భాషలు కనుమరుగు.. మళ్లీ బాంబ్ పేల్చిన స్టాలిన్

తమిళులు భాషా ప్రేమికులు.. తమ తమిళం కోసం ప్రాణాలైనా ఇస్తారు.. హిందీ అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకే ఏ తమిళ ప్రముఖుడు అయినా సరే హిందీలో మాట్లాడడు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 11:42 AM GMT
హిందీ వల్ల 25 భాషలు కనుమరుగు.. మళ్లీ బాంబ్ పేల్చిన స్టాలిన్
X

తమిళులు భాషా ప్రేమికులు.. తమ తమిళం కోసం ప్రాణాలైనా ఇస్తారు.. హిందీ అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకే ఏ తమిళ ప్రముఖుడు అయినా సరే హిందీలో మాట్లాడడు. తమిళం.. ఇంగ్లీష్ నే అక్కడ ఎక్కువ వాడుతారు. హిందీ వ్యతిరేక ఉద్యమాలు తమిళనాడులో ఎన్నో జరిగాయి. తాజాగా కొత్త విద్యావిధానంలో హిందీని తప్పనిసరి చేసిన కేంద్రంపై తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్షాలు పెద్ద యుద్ధమే ప్రకటించి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.

దేశంలో భాషలపై వివాదం కొత్తది కాదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను వ్యతిరేకించే భావజాలం బలంగా ఉంది. తాజాగా, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, తమిళనాడు అధికార పార్టీ డీఎంకే మధ్య హిందీ భాషపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ వివాదాన్ని మరింత ఉధృతం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

- హిందీ ప్రభావంతో భాషల నాశనం?

తమిళనాడు సీఎం స్టాలిన్‌ హిందీ కారణంగా ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. గురువారం ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టిన ఆయన "భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా వంటి భాషలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లు హిందీ రాష్ట్రాలు కావు. అక్కడ అసలు భాషలు గతంలోనే కలసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే మేము ప్రతిఘటిస్తున్నాం" అని పేర్కొన్నారు.

- కేంద్రం త్రిభాషా సూత్రం - తమిళనాడు వ్యతిరేకత

జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని నిర్ణయించింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని డీఎంకే ప్రభుత్వం చెబుతోంది. "తమిళ భాషకు, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అనుమతించబోము" అని స్టాలిన్‌ తేల్చి చెప్పారు.

-వివాదంపై భిన్న స్పందనలు

ఈ భాషా వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే, తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ ఈ వివాదంపై స్పందించారు. "భాజపా, డీఎంకే మధ్య మాటల యుద్ధం చిన్నపిల్లల కొట్లాటలా మారింది" అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి.

- హిందీ లొల్లి ఎటువైపు తీసుకెళుతుంది?

హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు గతంలోనూ పలుమార్లు ప్రతిఘటించింది. భాషపై కేంద్రం, తమిళనాడు మధ్య వైషమ్యం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కేంద్రం తన నిర్ణయాన్ని మారుస్తుందా, లేక తమిళనాడు తన వైఖరిని మరింత గట్టిగా నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.