Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ స‌రే.. 'తంబి'ల నుంచి చాలానే నేర్చుకోవాలి!

ఎంత సేపూ... ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవ‌డం, ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం వంటివి ప్ర‌త్య‌ర్థి పార్టీలకు చెందిన నా యకుల‌కు, పార్టీల‌కు కూడా కామ‌నే.

By:  Tupaki Desk   |   6 March 2025 2:00 PM IST
పాలిటిక్స్ స‌రే.. తంబిల నుంచి చాలానే నేర్చుకోవాలి!
X

ఎంత సేపూ... ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవ‌డం, ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం వంటివి ప్ర‌త్య‌ర్థి పార్టీలకు చెందిన నాయకుల‌కు, పార్టీల‌కు కూడా కామ‌నే. విష‌యం ఏదైనా త‌న్నుకోవ‌డ‌మే ప‌రమావ‌ధి అన్న‌ట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. నిష్ప‌క్ష పాతంగా చెప్పాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల‌కూ.. వ్య‌క్తిగత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్న విమ‌ర్శఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. రాష్ట్రాల‌కు కేంద్రం అన్యాయం చేస్తున్నా.. మోడీ ఒక విధ‌మైన ఒత్తిడి తెస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీల‌కు మాత్ర‌మే ఇది క‌నిపిస్తుంది.(ఇప్పుడు అది కూడా లేదు).

ఇక‌, అధికారంలో ఉన్న పార్టీల‌కు.. కేంద్రంపై పోరాడే శ‌క్తి కూడా లేకుండా పోవ‌డం మ‌రో కొస‌మెరుపు. అయితే.. కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని మాత్రం చెబుతారు. కానీ, ఉమ్మ‌డి పోరాటాలు, క‌ల‌సి క‌ట్టుగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు గొడుగు ప‌ట్ట‌డం.. ఉమ్మ‌డిగా ఒకే వేదిక‌పై క‌లిసి మాట్లాడ‌డం వంటివి ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్తి పార్టీలుగా ఉన్న బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌, టీడీపీ-వైసీపీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌వ‌నే చెప్పాలి. వీలు చిక్కిన‌ప్పుడు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డ‌మే ప‌ని! కానీ. పొరుగున ఉన్న త‌మిళ‌నాడు నాయ‌కులు మ‌రోసారి త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో చేతులు క‌లిపారు.

తాజాగా సీఎం స్టాలిన్ అఖిల ప‌క్ష స‌మావేశానికి పిలుపు ఇచ్చిందే త‌డ‌వుగా.. కొన్ని గంట‌ల ముందు కూడా .. ఆయ‌న‌ను తిట్టి పోసిన న‌టుడు విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, ఇక‌, ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ వంటి పార్టీలు.. మూకుమ్మ‌డిగా క‌లిసి వ‌చ్చి.. ముఖ్య‌మంత్రి చెంత‌నే కూర్చుని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అంతేకాదు.. ముక్క‌లు వేరైనా.. పార్టీలు వేరైనా.. సిద్ధాంత రాద్ధాంతాలు ఎలా ఉన్నా `తామంతా త‌మిళ‌నాడు బిడ్డ‌ల‌మ‌ని` చాటి చెబుతూ.. త‌మిళ‌నాడుకు వ్య‌తిరేకంగా కేంద్రం తీసుకునే ఏ చిన్న నిర్ణ‌యాన్న‌యినా.. క‌ల‌సి క‌ట్టుగా వ్య‌తిరేకించాల‌ని తీర్మానం చేశారు.

ఏంటా స‌మ‌స్య‌లు..

రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు త‌మిళ‌నాట‌ రాజ‌కీయాల‌ను వేడెక్కించాయి.

1) త్రిభాషా సూత్రం. అంటే.. స్థానిక భాష‌తోపాటు హిందీని నేర్పించ‌డం. దీనిపై కొన్నాళ్లుగా ఇక్క‌డ రాజ‌కీయ ప‌క్షాలు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇక‌, అధికార పార్టీ నేత సీఎం స్టాలిన్ అయితే..కేంద్రానికి స‌వాళ్లు రువ్వుతున్నారు. తాజాగా అన్ని పార్టీలు(బీజేపీ త‌ప్ప‌) చేతులు క‌లిపి.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల ను కాపాడేందుకు కేంద్రంపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యాయి.

అదేవిధంగా 2వ స‌మ‌స్య‌.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న. 2026లో కేంద్రం ఈ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నుంది. అయితే.. ఇది జ‌రిగితే.. ప్ర‌స్తుతం ఉన్న ఎంపీ సీట్లు త‌గ్గిపోతాయ‌ని త‌మిళ‌నాట పెద్ద ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో దీనిపై కూడా.. రాజ‌కీయ ప‌క్షాలు చేతులు క‌లిపాయి. ఉమ్మ‌డి పోరుకు రెడీ అయ్యాయి. అంతేకాదు.. బీజేపీ త‌మ రాష్ట్రానికి కించిత్తు న‌ష్టం చేకూర్చినా.. అంద‌రూ క‌లిసి ఢిల్లీ వెళ్లి పార్ల‌మెంటు ముందు ధ‌ర్నా చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వారు ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. మ‌రి ఈ త‌ర‌హా రాజ‌కీయాలు తెలుగు నాట ఎప్పుడు చూస్తామో?!!