Begin typing your search above and press return to search.

స్టాలిన్ గ్లామర్ ని పళనిస్వామి తట్టుకోగలరా ?

స్టాలిన్ కి పొలిటికల్ గా గ్లామర్ ఉంది. ఆయన కరుణానిధి నుంచి రాజకీయ వ్యూహాలను అనేకం నేర్చుకున్నారు. విద్యార్ధి నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు.

By:  Tupaki Desk   |   12 April 2025 3:30 AM
స్టాలిన్ గ్లామర్ ని  పళనిస్వామి తట్టుకోగలరా ?
X

తమిళనాడులో జనాలు ఎపుడూ పవర్ ఫుల్ గా ఉన్న వారినే తమ నాయకులుగా ఎంచుకుంటారు. తమిళలో ఆవేశం పాలు హెచ్చు. అన్యాయం అంటే వెంటే గొంతు చించుకోవాల్సిందే. కేంద్రం వద్ద తొడగొట్టే మొనగాడికే వారు కోరి మరీ తెచ్చి మెడలో వరమాల వేస్తారు.

అలా ఒకనాడు జయలలిత, కరుణానిధిలను పదే పదే గెలిపించి తమ రాజకీయ ఆకాంక్షలను అలా చాటుకున్నారు. ఇదిలా ఉంటే 2016లో జయలలిత అన్నాడీఎంకేని ఒంటి చేత్తే జయలలిత గెలిపించారు. ఆమె వరసగా రెండవసారి అధికారాన్ని అలా అందుకున్నారు. అవతల వైపు డీఎంకే నుంచి రాజకీయ భీష్ముడుగా ఉన్న కరుణానిధిని సైతం ఓడించారు.

అయితే అధికారం తెచ్చిన జయలలిత అదే ఏడాది చివరిలో మరణించారు. ఆమె సీఎం గా పనిచేసింది కొద్ది నెలలు మాత్రమే. ఆ తరువాత పన్నీరు సెల్వం కొన్నాళ్ళ పాటు సీఎం గా ఉన్నా అన్నాడీఎంకేలో తనకు ఉన్న సంస్థాగత బలం తొ పళనిస్వామి ఆయన్ని పక్కన పెట్టి సీఎం అయ్యారు. అలా జయలలిత తెచ్చిన అధికారాన్ని ఆయన నాలుగేళ్ళ పాటు అనుభవించారు

కానీ ఆయన నాయకత్వంలో అన్నాడీఎంకే గెలిచింది అయితే లేదు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 66 సీట్లకే అన్నాడీఎంకే పరిమితం అయింది బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి మిగిలినవి అన్నీ స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే కూటమి గెలుచుకుంది. ఇక స్టాలిన్ కి మరో విజయం 2024 ఎన్నికల్లో దక్కింది మొత్తానికి మొత్తం ఎంపీ సీట్లను ఆయన నాయకత్వంలో కూటమి గెలుచుకుంది.

స్టాలిన్ కి పొలిటికల్ గా గ్లామర్ ఉంది. ఆయన కరుణానిధి నుంచి రాజకీయ వ్యూహాలను అనేకం నేర్చుకున్నారు. విద్యార్ధి నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. యువజ నాయకుడిగా ఎదిగారు. ఎమర్జెన్సీ టైంలో కూడా యువ నేతగా తన సత్తా చాటారు. తండ్రి అధికారంలో ఉన్నా వెనక చక్రం తిప్పినది ఆయనే.

ఇక స్టాలిన్ ఈ రోజు దక్షిణాది రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఢీ కొడుతున్నారు. అయిదేళ్ళ ఆయన పాలన మీద సహజంగా కొంత వ్యతిరేకత ఉన్నా ఆయన సమ ఉజ్జీ నాయకులు అయితే అవతల వైపు లేరు అన్నది ఒక విశ్లేషణ. దానికి తోడు సినీ హీరో విజయ్ పార్టీ కూడా ఈసారి బరిలో ఉంటే ట్రయాంగిల్ జరిగి యాటీ ఓట్లు చీలి స్టాలిన్ కే మరోసారి అధికారం దఖలు పడుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో అన్నా డీఎంకే బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. మాజీ సీఎం అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని అమిత్ షా ప్రకటించారు. అన్నా డీఎంకే బీజేపీ పొత్తు సక్సెస్ ఫుల్ అని 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే నాటి పొత్తు సక్సెస్ వెనక జనాకర్షణ కలిగిన నేత జయలలిత ఉన్నారు. ఆమె ఐరన్ లేడీ. ఆమెని తమిళ జనాలు అమ్మగా గుండెల్లో పెట్టుకున్నారు. మరి నాటి సక్సెస్ రిపీట్ కావాలి అంటే కుదురుతుందా అన్నది చర్చగా ఉంది. స్టాలిన్ ని ఓడించాలని బీజేపీకి కసి ఉంది. దాంతో పొత్తులతో కత్తులు దూస్తోంది. కానీ తమిళనాట స్టాలిన్ కి ఎదురు నిలిచే పొత్తుగా ఇది ఉంటుందా లేక ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.