Begin typing your search above and press return to search.

"ఒకే దేశం ఒకే ఎన్నిక" విజయ్ టీవీకే పార్టీ ఆసక్తికర తీర్మానం!

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Nov 2024 3:36 AM GMT
ఒకే దేశం ఒకే ఎన్నిక  విజయ్  టీవీకే పార్టీ ఆసక్తికర తీర్మానం!
X

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, రాజ్యాధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న ఈ పార్టీ.. పొత్తులు, కూటములు, అధికారంలో వాటా... మొదలైన నిర్ణయాలతో తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో పలు తీర్మానాలు చేసింది.

అవును... "తమిళగ వెట్రి కళగం" పార్టీ చీఫ్ "దళపతి" విజయ్ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి ఆనంద్ బుస్సి సమక్షంలో పణైయూర్ లోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యవర్గ, జిల్లా నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పార్టీని బలోపేతం చేయడం, ప్రజల్లోకీ తీసుకెళ్లడం, జనాలను నేరుగా కలవడం మొదలైన విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో 26 తీర్మానాలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రధానంగా "ఒకే దేశం ఒకే ఎన్నిక" విషయంపై టీవీకే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా... ప్రజా సమాఖ్య పాలన విధానానికి ముప్పుగా ఉన్నట్లు చెబుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ "ఒకే దేశం ఒకే ఎన్నిక" ప్రకటన, దాని చట్టబద్ధత కల్పించే చర్యలను ఖండిస్తున్నట్లు టీవీకే తీర్మానం చేసింది.

ఇదే సమయంలో... నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రద్దు చేయాలని, పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. అదేవిధంగా... సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని చెన్నైలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

ఇదే క్రమంలో... మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి శిక్షను సూచించే ప్రస్తుత చట్టాలను బలోపేతం చేసి, నేరస్తులకు గరిష్ట శిక్ష వేసేలా చట్ట సవరణలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కోర్టుల ద్వారా వెంటనే శిక్ష పడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు.

వీటితోపాటు.. కోయంబత్తూర్ మెట్రోరైలు ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని, శ్రీలంక ఈళం తమిళులు, రాష్ట్ర జాలర్ల హక్కులను కాపాడాలని కోరుతూ... విద్యుతు, పాల ఛార్జీలు.. ఆస్తిపన్ను పెంపు వంటి చర్యల ద్వారా ప్రజలపై డీఎంకే ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపిందని విమర్శిస్తూ. కల్తీసారా విక్రయాలు పెరగడం, యువత మత్తుకు బానిసవ్వడం వంటి విషయాలను ఆరోపిస్తూ.. వీటి విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేశారు.