పార్టీ ఫ్యూచర్ పై విజయ్ కీలక వ్యాఖ్యలు.. కార్యకర్తలకు బహిరంగ లేఖ!
అవును... "తమిళగ వెట్రి కళగం" కేవలం నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని విజయ్ వెల్లడించారు.
By: Tupaki Desk | 30 Oct 2024 3:54 AM GMT"తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీ తొలి రాష్ట్రస్థాయి మహానాడు కార్యక్రమం విళుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ ప్రసంగంలో పలు సంచలన విషయాలే ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా... "సమాజంలో విభజనలు సృష్టిస్తున్న ఓ సమూహం ఉంది.. వారే మనకు మొదటి శత్రువులు".. ఇదే సమయంలో... "ద్రావిడ భావజాలాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకుంటూ.. తమిళనాడును కుటుంబ వ్యాపరంగా దోచుకుంటున్న వారు తమ తదుపరి ప్రత్యర్థులు" అని అన్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే... బీజేపీ తమకు సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. దీంతో.. ప్రధానంగా డీఎంకే నుంచి విజయ్ పై విమర్శలు మొదలైపోయాయి. టీవీకే పార్టీ బీజేపీకి సీ టీం అంటూ డీఎంకే పార్టీ నేతలు మొదలుపెట్టేశారు. ఈ విమర్శలపై తాజాగా విజయ్ స్పందించారు. అభిమానులకు ఓ లేఖ రాశారు.
అవును... "తమిళగ వెట్రి కళగం" కేవలం నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని విజయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా... రాబోయే రోజుల్లో విమర్శలు మరింత తీవ్రమవుతాయని తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. రాజకీయాల్లో టీవీకే ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఇదే సమయంలో... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని.. ప్రజల గుర్తింపు పొందేందుకు మనస్ఫూర్తిగా పని చేద్దామని పార్టీ శ్రేణులకు విజయ్ పిలుపునిచ్చారు. 2026 నాటికి మన లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని.. మనకు విజయం ఖాయమని లేఖలో పేర్కొన్నారు.
కాగా... ఆదివారం జరిగిన టీవీకే పార్టీ ఆవిర్భవ రాష్ట్ర సదస్సు కోసం విక్రవాండికి వెళుతుండగా వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో... పార్టీలోనూ, అనుచరుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమయంలో మరణించిన పార్టీ సభ్యుల పేర్లు పేర్కొంటూ ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు విజయ్.