Begin typing your search above and press return to search.

పాపం తమిళిసై !

ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఆమోదించడం వివాదంగా మారింది.

By:  Tupaki Desk   |   21 April 2024 1:30 PM GMT
పాపం తమిళిసై !
X

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ గా వ్యవహరించిన తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ఒక వెలుగు వెలిగింది. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజాదర్బార్ కు తలుపులు తెరిచి సంచలనం రేపింది. కేసీఆర్ ప్రభుత్వ పలు సిఫార్సులను పక్కనపెట్టి కోర్టుకు వెళ్లే పరిస్థితి తీసుకువచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా దానిని తిరస్కరించడం, తమిళిసై నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టడం సంచలనంగా మారింది.

ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఆమోదించడం వివాదంగా మారింది. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో పెండింగులో ఉంది. ఈ పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై బీజేపీ తరపున తమిళనాడు నుండి చెన్నై సౌత్ లోక్ సభ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

అయితే ఎన్నో నిర్ణయాలను, ప్రభుత్వ సిఫార్సులను పక్కనపెట్టి, ఆదేశించాల్సిన స్థాయిలో ఉండి, వ్యతిరేకించిన తమిళిసై ఇప్పుడు ఎన్నికల కమీషన్ ను చిన్న చిన్న అవసరాల కోసం అభ్యర్థించే పరిస్థితిలో ఉండడం గమనార్హం.

సౌత్‌ చెన్నై నియోజకవర్గంలోని 122వ వార్డు 13 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ జరపాలని బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పోలింగ్‌ జరుగుతుండగా మైలాపూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 122వ వార్డు ఆస్టిన్‌నగర్‌లోని 13వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రభు, అరుణ్‌ తదితరులు 50 మంది చొరబడి బీజేపీ ఏజెంట్లు గోవింద్‌ సహా పలువురిపై దాడి చేసి తరిమికొట్టి బూత్‌ స్వాధీనం చేసుకుని నకిలీ ఓట్లు వేశారని ఆరోపించారు.

13, 15, 17 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఆ దుండగులు ఉదయం నుంచే నకిలీ ఓట్లు వేశారని, ఇక చోళింగనల్లూరు ప్రాంతంలో వందల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్లు తమకు తెలిసిందని, టి.నగర్‌లోని 199, 200, 201, 202 వార్డులలోనూ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని తమిళిసై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు శాసించిన తమిళిసై ఇప్పుడు యాచించడం యాదృచ్చికమే అని భావించాలి.