కొత్త దంపతులకు బిగ్ టాస్క్ ఇచ్చిన సీఎం... 16 మంది పిల్లలంట!
అవును... జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 Oct 2024 2:52 AM GMTవృద్ధాప్య జనాభాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఓ ఆసక్తికర పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన సూచించారు. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులని చట్టం రావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
ఇదే క్రమంలో... ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి కొత్త చట్టాన్ని పరిగణలోకి తీసుకొవడంతోపాటు, జనాభా నిర్వహణను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరువాన్మియూర్ లోని మరుంధీశ్వరార్ ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన 31 జంటల కల్యాణోత్సవానికి హాజరైన ఆయన.. ప్రతీ కొత్త జంట 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు.
కొత్తగా పెళ్లైన జంటలకు 16 రకాల ఆస్తులు కలగాలని పూర్వం పెద్దలు ఆశీర్వదించేవారని.. అయితే, ఇప్పుడు మాత్రం ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలే ఆలోచన ఎందుకు చేయకూడదని స్టాలిన్ ప్రశ్నించారు.
కాగా... జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయిందని.. ఫలితంగా నిధుల కేటాయింపుల్లో కోత పడొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.