Begin typing your search above and press return to search.

పార్కులో పుట్టిన పార్టీకి 75 ఏళ్లు.. నేడే డీఎంకే వజ్రోత్సవ సంబరాలు!

అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి అందించిన ఈ పార్టీ నేడు వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటుంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:49 AM GMT
పార్కులో పుట్టిన పార్టీకి 75 ఏళ్లు.. నేడే డీఎంకే వజ్రోత్సవ సంబరాలు!
X

స్వాతంత్ర భారతదేశంలో దేశవ్యాప్తంగా తనదైన హవా కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న తొలి ప్రాంతీయ పార్టీగా ఘనత దక్కించుకున్న పార్టీ... ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే). అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి అందించిన ఈ పార్టీ నేడు వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటుంది.

అవును... అంటరానితనం నిర్మూలన, కుల వ్యతిరేకత, ఆత్మగౌరవం, స్త్రీవిద్య, స్త్రీహక్కు వంటి అంశాలపై జస్టిస్ పార్టీ పోరాడేది. తర్వాత దీని పేరు "డ్రావిడర్ కళగం"గా మారింది. అయితే.. ఈ పార్టీ సాంఘిక అంశాలకు మాత్రమే పరిమితమై ఉద్యమించడం నచ్చని అన్నాదురై వంటివారి ఆలోచనలోంచి పూర్తి రాజకీయ పార్టీగా డీఎంకే పుట్టింది!

ఇందులో భాగంగా.. 1947 సెప్టెంబర్ 17న చెన్నైలోని రాబిన్ సన్ పార్కులో డీఎంకేను ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1957లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే, 15 నియోజకవర్గాల్లో గెలిచి తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టింది. అనంతరం 1962లో జరిగిన ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో గెలిచి తన బలాన్ని పెంచుకుంది.

ఈ క్రమంలో 1965లో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటంతో డీఎంకే ప్రాభవం పెరిగింది. అనంతరం 1967లో జరిగిన ఎన్నికల్లో "ఒక రూపాయికి 2 సోలల బియ్యం లక్ష్యం.. ఒక సోల కచ్చితం" అంటూ అన్నాదురై చేసిన ప్రచారం సక్సెస్ అయ్యింది. ఫలితంగా... ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచి, అన్నాదురై నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.

ఆ విధంగా మొదలైన డీఎంకే రాజకీయ ప్రస్థానంలో... 25 ఏళ్లు అధికారంలో, సుమారు 35 ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగింది. ఈ పార్టీ పేరు చెబితే ప్రధానంగా గుర్తుకు వచ్చేవారిలో కరుణానిధి ఒకరు. తన 33వ ఏట 1957లో జరిగిన ఎన్నికల్లో కుళితులై నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపున పోటీ చేసి ఆయన ఎన్నికయ్యారు.

అనంతరం 1984 మినహా 2016 వరకూ జరిగిన 13 ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచారు కరుణానిధి. ఇది రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డ్. ఈ క్రమంలోనే అన్నాదురై తర్వాత ఈ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన కరుణానిధి.. ఐదు సార్లు ఆ పదవి వహించి రికార్డ్ సృష్టించారు.

అయితే ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన తనయుడు స్టాలిన్ ను 2014 జనవరి 4న కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక 2018 ఆగస్టు 8న కరుణానిధి మరణించడంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోనే డీఎంకే ప్రభుత్వం నడుస్తుంది.