తమిళనాడు ప్రజలకు రాముడు ఎవరో తెలియదు.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
గతేడాదే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి.. బాలరాముడు కొలువుదీరాడు. రాముడి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
By: Tupaki Desk | 15 Sep 2024 9:13 AM GMTగతేడాదే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి.. బాలరాముడు కొలువుదీరాడు. రాముడి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర ప్రజలు, రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ హోదాలో ఆ వ్యాఖ్యలో చేయడంతో చర్చకు దారితీసింది. ఆయన ఎందుకు అలా మాట్లాడారా అని ఆరా తీస్తున్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు ఉత్తరభారతానికే దేవుడు అన్న భావనను తమిళనాడు ప్రజల్లో కల్పించారంటూ అన్నారు. రాముడి గురించి తమిళనాడు ప్రజలకు పెద్దగా తెలియదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాముడు తిరగని చోటు లేదని, కానీ.. ఇక్కడి వారికి రాముడంటే తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. కేవలం ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను తమిళనాడు ప్రజల్లో తీసుకొచ్చారని ఆరోపించారు.
రాష్ట్ర యువతకు భారత సంస్కృతి తెలియకుండా సాంస్కృతిక హననం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా గవర్నర్ స్పందించారు. కొందరు గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు. వారు అలా ఎందుకు మాట్లాడారో తెలియదని అన్నారు. ఇప్పుడు ఎందుకు మూగబోయరని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య అంతగా పొసగడం లేదు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా.. ప్రభుత్వ స్కూళ్లపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని, విద్యార్థులు కనీసం రెండంకెల సంఖ్యను సైతం గుర్తించలేకపోతున్నారని ఆరోపించారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.