Begin typing your search above and press return to search.

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ ...పీక్స్ చేరిన వివాదం !

ఇవన్నీ పక్కన పెడితే 2021లో తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఆర్ ఎన్ రవికి అప్పుడే అధికారంలోకి వచ్చిన డీఎంకెకు మధ్య గ్యాప్ మొదటి నుంచి ఉంటూ వస్తొంది.

By:  Tupaki Desk   |   7 Jan 2025 12:05 PM GMT
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ ...పీక్స్ చేరిన వివాదం !
X

గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా అలాంటిదే. అయితే రాజ్యాంగం ప్రకారం అన్నీ అమలు జరిగేలా ఒక రాష్ట్రంలో చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. గవర్నర్ తన ప్రభుత్వం అని భావిస్తూ ముఖ్యమంత్రిని మంత్రి మండలిని నియమిస్తారు. ఇక పాలన అంతా గవర్నర్ పేరు మీద సాగుతుంది.

ఏటా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరిగే సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉదేశించి ప్రసంగిస్తారు. అది ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవికి అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా గ్యాప్ అన్నది ఉంది. గవర్నర్ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని తమను ఇబ్బంది పెడుతున్నారు అని డీఎంకే అసహనంతో ఉంటూ వస్తోంది.

ఇక లేటెస్ట్ గా చూస్తే తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా హాజరైన గవర్నర్ అనంతరం వాకౌట్ చేశారు. దానికి రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నదేంటి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచారని. అందుకే గవర్నర్ ఆర్‌ఎన్ రవి సంప్రదాయ ప్రసంగం చేయకుండా వెళ్లిపోవాల్సి వచ్చిందని పేర్కొనారు.

సభ ప్రారంభం అవుతూనే జాతీయ గీతాన్ని ఆలపించాలి అన్నది రాజ్ భవన్ వర్గాలు చెబుతున్న మాట. అయితే దానికి బదులుగా తమిళ తాయ్ వజ్తు అనే రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆలపించారు. దాంతో సంప్రదాయాలను తమిళనాడు ప్రభుత్వం గౌరవించడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ఆర్ ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇదిలా ఉంటే దీని మీద మంగళవారం తమిళనాడు అంతటా డీఎంకే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్య మంత్రి స్టాలిన్ అయితే గవర్నర్‌వి పిల్ల చేష్టలు అని విమర్శించారు. ఆయన అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘించే విధానం బాగులేదని అని ఫైర్ అయ్యారు. గవర్నర్ ఈ విధంగా చేయడం ఇది మూడోసారి అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే 2021లో తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఆర్ ఎన్ రవికి అప్పుడే అధికారంలోకి వచ్చిన డీఎంకెకు మధ్య గ్యాప్ మొదటి నుంచి ఉంటూ వస్తొంది. గత మూడున్నరేళ్ళుగా అలాగే సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కోరి బీజేపీ గవర్నర్లను నియమిస్తున్నారు అని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.

విపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది అని అంటున్నారు. ఒక గవర్నర్ గా రాజ్యాంగ రక్షకుడిగా ఆర్ ఎన్ రవి నిష్పాక్షింగా వ్యవహరించడంలో విఫలం అవుతున్నారని డీఎంకే నేతలు అంటున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ సహనానికి హద్దు ఉంటుందని అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి వచ్చి వాకౌట్ చేయడం కంటే ఇంట్లో కూర్చోవడమే మంచిదని ఆమె చురకలు అంటించారు

ఇలా గవర్నర్ వర్సెస్ డీఎంకే గా తమిళనాడులో కొత్త ఏడాదిలో మరో కొత్త వివాదం మొదలైంది. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియదు. ఇదిలా ఉంటే ఇటీవల ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. తమిళనాడు లో కూడా కొత్త గవర్నర్ వస్తారని ఊహాగానాలు వచ్చినా అది జరగలేదు.

ఇక ఆర్ ఎన్ రవి పదవీకాలం 2026 చివరి వరకూ ఉంది అని అంటున్నారు. 2026 మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మరి అప్పటిదాకా రవినే కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే డీఎంకే ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ బీజేపీని విమర్శిస్తోంది. దాంతో బీజేపీ అయితే గవర్నర్ గా రవిని మార్చే ప్రసక్తి ఉండదని అంటోంది. 2026 ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం తమిళనాడులో వచ్చిన తరువాతనే రవి స్థానంలో కొత్త గవర్నర్ గా వస్తారు అని అంటున్నారు. అప్పటివరకూ ఇలా తమిళనాడులో డీఎంకే వర్సెస్ రాజ్ భవన్ గా రాజకీయాలు వేడిగా సాగాల్సిందే అని అంటున్నారు.