కేంద్రంపై మరో భాషా యుద్ధమే.. ఎంపీ సీట్లు తగ్గితే సమరమే.. స్టాలిన్
నూతన విద్యా విధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని ఇప్పటికే మండిపడుతున్న స్టాలిన్.. ఎన్‌ఈపీని ఉద్దేశిస్తూ మరోసారి మాట్లాడారు.
By: Tupaki Desk | 25 Feb 2025 10:25 AM GMTహిందీ అంటే అంతెత్తున ఎగిరి దూకే తమిళనాడు మరోసారి భాషా ఉద్యమానికి కేంద్రంగా మారనుందా? హిందీని తమపై రుద్దొద్దు అంటూ పెద్ద యుద్ధమే సాగించిన తంబీలు మళ్లీ తిరుగుబాటు చేయనున్నారా? పరిస్థితులు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి కత్తి దూశారు.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానం ను (ఎన్‌ఈపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం దాని అమలు చేసేది లేదంటోంది.. ఎన్ఈపీలో భాగమే త్రిభాషా సూత్రం. దీంతో మోదీనే నేరుగా రంగంలోకి దిగి ఇటీవల భాషల మధ్య వైషమ్యాలు రేపొద్దని.. అవి పరస్పర సహకారంతోనే ఎదిగాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే, నూతన విద్యా విధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని ఇప్పటికే మండిపడుతున్న స్టాలిన్.. ఎన్‌ఈపీని ఉద్దేశిస్తూ మరోసారి మాట్లాడారు. మరో భాషా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇక లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపైనా స్టాలిన్ స్పందించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అని అభివర్ణించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జనాభా నియంత్రణ భారత్ ముందున్న అతిపెద్ద లక్ష్యమని.. ఇందులో తమిళనాడు విజయం సాధించిందన్నారు. తక్కువ జనాభా ఉండడం వల్ల పార్లమెంటు సీట్లు తగ్గే ప్రమాదాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోందని అన్నారు. సీట్లు తగ్గితే.. ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 31 అవుతాయని పేర్కొన్నారు.
కాగా, స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర స్పందించింది. భాషలను రాజకీయ కోణంలో చూడొద్దని కోరింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుతో పెట్టుకోవదంటూ స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మోదీ.. భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ హితబోధ చేశారు. భాషల మధ్య ఎప్పుడూ వైరం లేదని.. పరస్పరం చేయూతతో సంపన్నమయ్యాయని తెలిపారు. తాజాగా భాష అంశంపై స్పందిస్తూ.. స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.