ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి!
డీఎంకే నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
By: Tupaki Desk | 14 Sep 2023 8:50 AM GMTసనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాతో పోలుస్తూ .. దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు డీఎంకే ఎంపీ రాజా మరో అడుగు ముందుకేసి సనాతన ధర్మం హెచ్‌ఐవీ కంటే డేంజర్ అని వ్యాఖ్యానించి మరింత హీట్ పెంచారు.
డీఎంకే నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), కాంగ్రెస్ పార్టీలు.. ఉదయనిధి వ్యాఖ్యలు వ్యక్తిగతమని తేల్చిచెప్పాయి. అన్ని మతాలను గౌరవించడమే తమ విధానమని స్పష్టం చేశాయి.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యల ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఉదయనిధి తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నష్టనివారణ చర్యలకు దిగారు. సనాతన ధర్మంపై ఎవరూ మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచించారు. సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరారు.
బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని డీఎంకే నేతలకు స్టాలిన్ సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని ఆయన తెలిపారు.
సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. నేతలందరూ ఈ విషయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలని స్టాలిన్ తమ పార్టీ నేతలకు సూచించారు.
మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని కోరారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయన్నారు. వాటి ట్రాప్ లో చిక్కుకుని మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వొద్దని కోరారు.