బీజేపీలో తెలంగాణ మాజీ గవర్నర్... పోటీ చేసే ప్లేస్ ఫిక్స్!
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ భారతీయ జనతాపార్టీలో చేరారు.
By: Tupaki Desk | 20 March 2024 3:30 PM GMTతెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ మేరకు ఆమె బుధవారం చెన్నైలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడలో కాషాయ కండువాతో తమిళిసై సుందరరాజన్ కనిపించారు.
అవును... తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బీజేపీలో చేరారు. వాస్తవానికి ఆమె ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు పంపగానే ఆమె ఆమోదించారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కూడా ఆమె తన రాజీనామా లేఖను సమర్పించారు.
వాస్తవానికి తమిళిసై ఒకప్పుడు బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలోనే 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. అనంతరం 2019లో లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలోనూ ఓడిపోయారు!
ఈ క్రమంలో మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాగా... తమిళిసై కి తెలంగాణలో మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండు సంవత్సరాలు పదవీకాలం ఉంది.
ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితా రెండు విడలు విడుదలవ్వగా... త్వరలో మూడో విడత విడుదలకానుందని తెలుస్తుంది. ఇక వచ్చే నెల 19న తొలివిడతలో భాగంగా తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మూడోజాబితాలో తమిళిసై పేరు అధికారికంగా వెలువడనుందని తెలుస్తుంది. తుత్తుకూడి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేయొచ్చని అంటున్నారు!
ఈ నియోజకవర్గలో 2019 ఎన్నికల్లో డీఎంకే నుంచి పోటీచేసిన కనిమొళికి 5,63,143 ఓట్లు పోలవ్వగా... బీజేపీ నుంచి బరిలోకి దిగిన తమిళిసై కి 2,15,934 ఓట్లు దక్కాయి. దీంతో... 3,47,209 భారీ మెజారిటీతో కనిమొళి విజయం సాధించారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి తమిళిసై మరోసారి బరిలోకి దిగనున్నారని అంటున్నారు.