Begin typing your search above and press return to search.

పుదుచ్చేరి నుంచి ఆ గవర్నర్? నిర్ణయం మాత్రం వారిదే?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:30 AM GMT
పుదుచ్చేరి నుంచి ఆ గవర్నర్? నిర్ణయం మాత్రం వారిదే?
X

వైద్యురాలిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలిగా చేశారు.. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పలుసార్లు పోటీ చేశారు.. వ్యక్తిగా మంచి పేరున్నా.. పార్టీ పరంగా బలం లేకపోవడంతో ఓటమిపాలయ్యారు. అయితే, పార్టీకి చేసిన విశేష సేవలకు గాను ఆమెను గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించారు. అందులోనూ తనదైన ముద్ర చూపిన ఆమె.. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అవకాశం దక్కితే మాత్రం అటువైపు అడుగులు వేయడంలో సందేహం లేదని స్పష్టమవుతోంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఈమె గతంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా పనిచేశారు. 2019 సెప్టెంబరు 9న తెలంగాణ గవర్నర్ గా వచ్చారు. 2021 ఫిబ్రవరి నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళిసై గతంలో మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చివరిసారిగా తూత్తుకుండి నుంచి డీఎంకే మాజీ చీఫ్, మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి చేతిలో పరాజయం పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్ నుంచి ఓడిపోయారు. 2006లో రాధాపురం, 2011లో వేలచేరి, 2016లో విరుంగపాక్కం నుంచి అసెంబ్లీకి పోటీచేసినా విజయం దక్కలేదు.

పరిస్థితులు మారాయి..

2019లో ఓటమి అనంతరం తెలంగాణ గవర్నర్ గా వచ్చారు తమిళిసై. అయితే, అప్పటికి ఇప్పటికి తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో గతంతో పోలిస్తే డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం పుదుచ్చేరి పైనా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో గవర్నర్ పదవులను వదులుకుని ఎంపీగా పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు.

తమిళనాడు కాదు.. పుదుచ్చేరి

తమిళిసై ఈసారి తమిళనాడు నుంచి కాకుండా పుదుచ్చేరి నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా పుదుచ్చేరికి ఎల్జీగా ఉన్న ఆమె అక్కడకు తరచూ వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోనే పుదుచ్చేరిలో పోటీకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని పేర్కొంటున్నారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాణికి అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. వాస్తవానికి తమిళిసై తెలంగాణలో ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సమయంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కథనాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఏం జరగనుందో?