స్పీకర్ తమ్మినేనికి యాంటీ సెంటిమెంట్ ప్రభావం...?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ పెద్దాయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిజ జీవితంలో పహిల్వాన్. అలాగే రాజకీయాల్లో కూడా పహిల్వాన్ గా తన సత్తా చాటారు.
By: Tupaki Desk | 20 Nov 2023 3:42 AM GMTశ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ పెద్దాయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిజ జీవితంలో పహిల్వాన్. అలాగే రాజకీయాల్లో కూడా పహిల్వాన్ గా తన సత్తా చాటారు. ఆయన రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అలాగే తొమ్మిదేళ్ల పాటు అనేక కీలక మంత్రిత్వ శాఖలు టీడీపీ హయాంలో చేపట్టారు.
ఇక ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా ఆముదాలవలస నుంచి పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. 2014 నాటికి ఆయన వైసీపీలో చేరి పోటీ చేసి ఓటమిని చూశారు. 2019లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి కావాలని ఆశపడిన తమ్మినేనికి జగన్ స్పీకర్ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవిని ఇచ్చారు.
అయితే విస్తరణలో అయినా అవకాశం ఉంటుందని తమ్మినేని భావించినా ఆ ముచ్చటా లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తమ్మినేనికి 2024లో ఆముదాల వలస టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఆయన్ని ఎంపీగా శ్రీకాకుళం పార్లమెంట్ కి పోటీ చేయమని పార్టీ కోరుతోందని టాక్ నడుస్తోంది.
ఆముదాలవసల టికెట్ ఇచ్చినా కూడా తమ్మినేని ఈసారి గెలిచే అవకాశాలు లేవు అని అంటున్నారు. ఎంపీగా గెలవడం కూడా టఫ్ జాబ్ గా ఉంది. అయితే తమ్మినేని మాత్రం శాసనసభ కే మొగ్గు చూపుతున్నారు. కానీ అధినాయకత్వం మాత్రం కొత్త ముఖం కోసం వెతుకుతోంది.
తమ్మినేని ఇపుడు ఎంపీగా పోటీకి రెడీ అయితే ఓకే లేకపోతే మాత్రం ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాన్స్ అయితే ఉండదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే స్పీకర్లుగా పనిచేసిన వారికి రాజకీయ జీవితం అంత గొప్పగా ఉండదు అని గత స్పీకర్ల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. స్పీకర్ గా పనిచేసిన యనమల రామక్రిష్ణుడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అయితే చంద్రబాబు ఆయన మీద చూపించిన అభిమానానికి ఎమ్మెల్సీగా అయి మంత్రిగా పనిచేయడం ద్వారా తన రాజకీయ జాతకాన్ని మార్చుకున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కోడెల శివ ప్రసాద్ కూడా స్పీకర్ గా పనిచేసిన తరువాత రెండవమారు పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి ప్రతిభా భారతి కూడా రాజకీయంగా అంత చురుగ్గా లేరు. ఆమె అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
దీంతో తమ్మినేని కి ఈ యాంటీ సెంటిమెంట్ ప్రభావం ఏమైనా చూపిస్తుందా అన్న కలవరంలో అనుచరులు ఉన్నారు. ఇక పెద్దాయన తమ్మినేని అయితే తన కుమారుడికి ఆముదాలవలస టికెట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. అయితే తమ్మినేని కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఓటమి తప్పదని సర్వే నివేదికలు చెప్పడంతోనే వైసీపీ హై కమాండ్ కొత్త అభ్యర్ధి కోసం చూస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా తమ్మినేని రాజకీయ ఏ మలుపు తీసుకుంటుందో అన్న బెంగ అయితే అనుచరులలో దండీగా ఉందిట.