Begin typing your search above and press return to search.

హైడ్రా కూల్చివేతల వేళ... బిగ్ ఇష్యూ రేజ్ చేసిన తమ్మారెడ్డి!

ఇక సిటీలోని అనుమతులు లేని ఇళ్ల విషయానికొస్తే... హైదరాబాద్ లో సుమారు 50శాతం పోతుందని తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 12:59 PM GMT
హైడ్రా కూల్చివేతల వేళ... బిగ్  ఇష్యూ రేజ్  చేసిన తమ్మారెడ్డి!
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘ఎన్ కన్వెషన్’ ను హైడ్రా కూల్చివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మాదాపూర్ లోని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెషన్’ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణంగా పేర్కొంటూ హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టుకు వెళ్లిన ‘ఎన్ కన్వెషన్’ యాజమాన్యం స్టే తెచ్చుకుంది.

ఈ విషయాలపై తాజాగా స్పందించిన నాగార్జున అభిమానులకు, ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. ఇందులో భాగంగా... 'ఎన్-కన్వెషన్’ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. పట్టా భూమిలోనే కన్వెషన్ ను నిర్మించామని.. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని పునరుధ్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తమ్మారెడ్డి స్పందించారు.

అవును... హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుండటం, ఆ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతుండటం, ఈ నేపథ్యంలో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేత, ఈలోపు హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు మొదలైన అంశాలు హాట్ టాపిక్స్ గా ఉన్న వేళ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తనకు తెలిసినంతవరకూ ఆ ఎన్ కన్వెషన్ స్థలాన్ని నాగార్జున కొనుక్కున్నారని.. అయితే అది వీళ్ల ప్రాపర్టీ అయినా చెరువుకు ఆనుకుని ఉండటం వల్ల కట్టడానికి లేదని అన్నారు. అయితే... ఈ హైడ్రా అనేది ఎఫ్.టీ.ఎల్. పై మాత్రమే చేస్తున్నారా.. లేక, అనుమతులు లేని నిర్మాణాల మీద చేస్తున్నారా అని తమ్మారెడ్డి సందేహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇటీవల చిత్రపురి కాలనీలో అనుమతులు లేవని ఆరు ఇళ్ళు కూల్చారని.. కానాపూర్ లో సుమారు అరవై ఇళ్లు కూల్చారని, వాటికి ఎఫ్.టీ.ఎ.ల్ ను కారణంగా చూపించారని తెలిపారు. ఎఫ్.టీ.ఎల్. కారణంగా ఈ కూల్చివేత సాగితే మోకీలా వైపు ఉన్న నిర్మాణాలను కొట్టుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి వీళ్లందరివీ చాలా వస్తాయని అన్నారు!

ఇక సిటీలోని అనుమతులు లేని ఇళ్ల విషయానికొస్తే... హైదరాబాద్ లో సుమారు 50శాతం పోతుందని తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో స్లమ్స్ అన్నీ కబ్జాలే అని.. చెరువులను పూర్తిగా పూడ్చేసినవి ఉన్నాయని చెబుతూ... ఎల్లారెడ్డిగూడ చెరువు, యూసఫ్ గూడ చెరువులను గుర్తు చేశారు తమ్మారెడ్డి.

ఈ క్రమంలో... అసలు ఇప్పుడు యూసఫ్ గూడ చెరువు, ఎల్లారెడ్డిగూడ చెరువు అనేవి తన చిన్నప్పుడు ఉండేవని.. ఇప్పుడు అసలు అవి కనిపించకుండా పోయాయని తెలిపారు. అందులో ఒక చెరువులో సగం కృష్ణకాంత్ పార్కు, మిగిలింది దానికి ఆపోజిట్ రోడ్డులో ఉన్న కాలనీ వెలిశాయని అన్నారు. సారధి స్టూడేయో వెనుక ఉన్న చెరువు స్థానంలో మొత్తం ఇల్లు వచ్చేశాయని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే వర్షాలు వచ్చినప్పుడు తమ ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయని, మున్సిపల్ అధికారులు పట్టించుకొవడం లేదని చెప్పే ఇళ్లాన్నీ ఇల్లీగల్ కనస్ట్రక్షన్సే అంటూ తమ్మారెడ్డి బాంబు పేల్చారు. ఇలా చూసుకుంటే 50శాతం హైదరాబాద్ పోతుందని.. అంటే.. అన్ని ఓట్లు పోతాయని భరద్వాజ తెలిపారు. సరే వీటి సంగతి అలా ఉంచితే... ఎఫ్.టీ.ఎల్. పరిధిలోనే చేస్తారా.. అందులోనూ రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తారా అనేది కూడా చర్చనీయాంశం అని తెలిపారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సమయంలో... ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ల అక్రమ నిర్మాణాలు కూల్చి, తర్వాత తమవద్దకు రండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారని.. అది కూడా సరైంది కాదని.. ఎవరు నిబందనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినా కూల్చేయాల్సిందే అని అని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ!