Begin typing your search above and press return to search.

బాబు...పవన్ మీద తమ్మారెడ్డి హాట్ కామెంట్స్...!

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:25 PM GMT
బాబు...పవన్ మీద తమ్మారెడ్డి హాట్ కామెంట్స్...!
X

టాలీవుడ్ లో సీనియర్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ గా తమ్మారెడ్డి భరద్వాజా ఉన్నారు. ఆయనకు రాజకీయ సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన తరచూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా ఆయన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణా ఎన్నికల గురించి ముందుగా ఆయన మాట్లాడుతూ అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది అని అన్నారు. అసలు కాంగ్రెస్ అనేక సమస్యలతో సతమతం అవుతున్న వేళ ఇపుడు గెలుపు గుర్రం అవడం అంటే అనూహ్యమే అన్నారు. అయితే ఏ పార్టీ గెలుపు అంత ఈజీ కాదని అదే సమయంలో ఏమైనా తెలంగాణాలో పరిణామాలు జరగవచ్చు అని అన్నారు.

ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ టీడీపీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ అని అలాంటి పార్టీ చంద్రబాబుని తానుగా సొంతంగా చంద్రబాబుని రక్షించుకోలేదా అని ప్రశ్నించారు. వేరే వారి సాయం టీడీపీకి కావాల్సి రావడం అంటే ఇబ్బందికరమే అని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి జనసేన అండ కావాలని, గెలుపు కోసం అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుందని ఆయన విశ్లేషించారు.

ఇక జనసేన కూడా తాను సొంతంగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎంతదాక ఉంటాయో తెలియదని అందుకే టీడీపీతో పొత్తు కుదుర్చుకుందని అన్నారు. ఇలా ఇద్దరి అవసరాలే పొత్తుకు దారి తీశాయని అన్నారు. ఇక తెలంగాణాలో బీజేపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడం వెనక గెలుపు ఆశలే ఉన్నాయని అన్నారు. సొంతంగా బీజేపీ పోటీ చేయలేకనే జనసేను తోడు తెచ్చుకుందని అన్నారు.

తమాషా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న డ్యూయల్ రోల్ మీద తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీతో పొత్తు తెలంగాణాలో బీజేపీతో పొత్తు ఇలా పవన్ రెండు విధాలుగా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పవన్ వరకూ ఆయన ఇలా చేస్తున్నా అటు చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ కానీ దీని మీద ఏమీ మాట్లాడకపోవడం చిత్రమే అని అన్నారు.

మాతో పొత్తులో ఉండి ఏపీలో టీడీపీతో పొత్తు ఏంటి అని బీజేపీ అడగదని, అలాగే బీజేపీతో పొత్తులో ఉంటూ తనతో పొత్తు కలిపినా చంద్రబాబు మాట్లాడరని తమ్మారెడ్డి సెటైర్లు పేల్చారు. చూస్తూంటే ఇక్కడ ఎవరి అవసరాలు వారివి అన్నట్లుగానే ఉంది అని అన్నారు. అందువల్లనే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం రెండు విధాలుగా సాగుతోందని అన్నారు.

మరో వైపు చూస్తే పవన్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారు అని తమ్మారెడ్డి విమర్శించారు. ఆయన బీజేపీ టీడీపీకి ఓటేయమని 2014లో కోరారని, ఆ తరువాత 2019కి వచ్చేసరికి ఆ రెండు పార్టీల నుంచి వేరు పడ్డారని, మాయావతిని దేశానికి ప్రధానిగా చేయాలని అన్నారని, ఇపుడు చూస్తే ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రధానిగా మోడీ బెస్ట్ అని అంటున్నారని తమ్మారెడ్డి విమర్శించారు.

పవన్ తలచుకుంటే ఏమైనా చేయగలరని, ఆయనకు జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందని కానీ ఆయన పదేళ్ళ రాజకీయం చూస్తే మాత్రం కొంత నిరాశ కలుగుతోదని తమ్మారెడ్డి విశ్లేషించారు. ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ గా తాను ఉన్నానని పవన్ చెప్పి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి అని ఆయన అంటున్నారు. చంద్రబాబు విషయం తీసుకుంటే టీడీపీ పటిష్టమైన పార్టీగా ఉందని అంటున్నారు. కానీ బాబు అరెస్ట్ అయితే ఆయన్ని పార్టీని కాపాడుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉందా అనిపించిందని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ పాలన గురించి మాట్లాడుతూ అభివృద్ధి అన్నదే ఏపీలో లేదని కామెంట్స్ చేశారు.

మొత్తంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ప్రజలకు అన్నీ తెలుసు అన్నారు. రాజకీయాల్లో ప్రజలు అన్నీ గమనిస్తారని వారు పిచ్చోళ్ళు అయితే కారని ఆయన అన్నారు. ప్రజలు ఎపుడూ సరైన తీర్పే ఇస్తారని చెప్పిన తమ్మారెడ్డి రాజకీయ జోస్యాలు మాత్రం చెప్పకపోవడం విశేషం.