Begin typing your search above and press return to search.

తమ్మినేని కుటుంబ సమేతంగా జనసేనలోకి ?

1983లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన తమ్మినేని అలా తన రాజకీయ అరంగేట్రం చేశారు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 8:30 PM GMT
తమ్మినేని కుటుంబ సమేతంగా జనసేనలోకి ?
X

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా జనసేనలోకి వెళ్తారా. ఈ ప్రచారంలో ఎంత మేరకు నిజం ఉంది అన్నది అంతా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే తమ్మినేని బిగ్ షాట్ గా జిల్లాలో వైసీపీలో ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు

జిల్లా రాజకీయాలలో ఆయన ప్రముఖుడిగా నిలిచారు. 1983లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన తమ్మినేని అలా తన రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు

ఆయన ఎన్టీఆర్ చంద్రబాబులకు సన్నిహితుడుగా మెలిగారు. అయితే 2004లో ఓటమి తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం వైపు వెళ్లారు. 2009లో ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకుని పోటీ చేసినా ఓటమి ఎదురైంది. 2014 నాటికి వైసీపీలో చేరి పోటీ పడినా ఓటమి మళ్లీ ఎదురైంది.

ఇక 2019లో ఆయనకు ఘన విజయం వైసీపీ నుంచి దక్కింది. 1999 తరువాత ఇరవై ఏళ్లకు మళ్లీ తాను గెలిచాను అదంతా వైసీపీ జగన్ పుణ్యమే అని ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందని కూడా తమ్మినేని ఆశించారు. కానీ అది జరగలేదు.

దాంతో ఆయన నిరాశపడినా స్పీకర్ వంటి కీలక పదవి వరించింది. అయిదేళ్ల పాటు స్పీకర్ గా ఆయన వైసీపీ ప్రభుత్వంలో వ్యవహరించారు. అయితే తమ్మినేని 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలస నుంచి చింతాడ రవికుమార్ అనే ఒక ద్వితీయ శ్రేణి నేతకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామాం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తిని కలుగచేసిందని అంటారు. అంతే కాదు ఆయన అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అని చెబుతున్నారు. వైసీపీ నిరసన కార్యక్రమాలలోనూ కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఆయన వైసీపీని వీడుతారా అన్న చర్చ జరుగుతూనే ఉంది. ఇపుడు తమ్మినేని కుటుంబ సమేతంగా జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. తమ్మినేనికి ఉన్నది అదే ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీలో సొంత మేనల్లుడు కూన రవికుమార్ ఉన్నారు. ఆయన ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆయనను కాదని తమ్మినేనిని పార్టీలోకి తీసుకునే చాన్స్ లేదు. ఇక జనసేన బీజేపీ ఈ రెండే ఉంటే ఇందులో జనసేన వైపు తమ్మినేని ఫ్యామిలి మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనను పటిష్టం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. దాంతో ఆముదాలవలస నుంచి బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న తమ్మినేని చేరిపోతారు అని అంటున్నారు.

తమ్మినేని తన కుమారుడు చిరంజీవి నాగ్ ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్ధిగా చూడాలని అనుకుంటున్నారు. వైసీపీలో అయితే తమ్మినేని కుటుంబానికి సీటు దక్కే సూచనలు లేవు అని అంటున్నారు. మూడు సార్లు టికెట్ ఇస్తే ఒకసారి మాత్రమే తమ్మినేని గెలిచారని పైగా బలంగా ఉన్న మేనల్లుడి ధాటిని తమ్మినేని ఎదుర్కోలేకపోతున్నారని వైసీపీలో వర్గ పోరు పెరిగిందని కారణాలతో ఆయనని పార్టీ పక్కన పెట్టి సెకండ్ గ్రేడ్ లీడర్ షిప్ ని ప్రోత్సహిస్తోంది.

దాంతో తమ్మినేని కుటుంబం జనసేనలో చేరి 2029లో ఎమ్మెల్యే టికెట్ ని అందుకోవాలని చూస్తోంది. అయితే అది అంత సులువు కాదనే అంటున్నారు. పొత్తులో ఈ సీటు టీడీపీ వదులుకోదని చెబుతున్నారు. అయితే కూటమిలో చేరితే ఏదో ఒక విధంగా రాజకీయంగా వెలగవచ్చు అన్నది కూడా ఆ ఫ్యామిలీ ఆలోచిస్తోంది అంటున్నారు. తమ్మినేని సతీమణి సర్పంచ్ గా ఉన్నారు. దాంతో ఇపుడు ఆ ఫ్యామిలీ అధికార కూటమి వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రజారాజ్యంలో తమ్మినేని గతంలో పని చేసారు. దాంతో జనసేనలో చేరడం అంటే పాత పార్టీలోకి వెళ్తున్నట్లుగానే ఫీల్ అవుతున్నారు. మొత్తానికి తమ్మినేని చేరికకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక టోటల్ ఫ్యామిలీ మొత్తం చేరిపోతుంది అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ వైసీపీకి అయితే తమ్మినేని దూరంగానే ఉంటున్నారు అన్నది వాస్తవమని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.