తమ్మినేని సొంత రూట్లో ?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీలో కొనసాగుతున్నట్లేనా లేదా అన్న డౌట్లు వస్తున్నాయి
By: Tupaki Desk | 7 Feb 2025 8:30 PM GMTశ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీలో కొనసాగుతున్నట్లేనా లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆ మధ్యన ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగితే దానిని గట్టిగా ఖండించారు. అంతే కాదు వైసీపీలోనే ఉంటాను అని చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళ పాటు ఆ పని మీద ఉన్నాను తప్పించి మరేమీ కాదని వివరణ ఇచ్చారు.
అయితే ఈ మాటలు చెప్పిన తరువాత కూడా మాజీ స్పీకర్ వైసీపీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించినది లేఎదు అని అంటున్నారు. తాజాగా చూస్తే ఆయన మీడియా మీట్ పెట్టారు. ఒక ప్రజా సమస్యను తీసుకుని ఆయన ముందుకు వచ్చారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలోని బూర్జ, సరుబుజ్జిలి మండలాలోని గిరిజన గ్రామాల సమీపంలో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ జెన్కో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల గిరిజనులకు ఎంతో నష్టం అవుతుందని వారు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారని తమ్మినేని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల జీవనోపాధి కోల్పోతామని భావిస్తున్నారని అన్నారు గిరిజనులు అంతా ఉద్యమించాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకగా నిర్ణయం చేస్తే మాత్రం భారీ ఉద్యమం తప్పదని తమ్మినేని హెచ్చరించారు. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని తమ్మినేని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే తమ్మినేని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన తన అనుచరులు అయిన వారితో కలసి ఇందులో పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జిగా ఆయనకు పదవి ఉంది. కానీ మాజీ స్పీకర్ గానే ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడం విశేషం.
దీంతో తమ్మినేని స్వతంత్ర పంధాలో ముందుకు సాగుతున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. తమ్మినేని సీనియర్ లీడర్. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న వారు. ఆయన వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని చెప్పకపోవడంతో డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. ఆముదాలవలసకు వైసీపీ ఇంచార్జిగా కొత్తవారిని నియమించడంతో తమ్మినేని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.