డిపాజిట్ కోల్పోయే దిశగా కామ్రెడ్!
కమ్యూనిస్టు యోధుడు, మేధావి.. సీపీఎం నేత.. తమ్మినేని వీరభద్రం.. డిపాజిట్ కోల్పోయే దిశగా చాలా వేగంగా దూసుకుపోతున్నారు
By: Tupaki Desk | 3 Dec 2023 7:02 AM GMTకమ్యూనిస్టు యోధుడు, మేధావి.. సీపీఎం నేత.. తమ్మినేని వీరభద్రం.. డిపాజిట్ కోల్పోయే దిశగా చాలా వేగంగా దూసుకుపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో 2 ఓట్లు పడగా.. వీఎంల ద్వారా లెక్కిస్తున్న ఓట్లలో మూడో రౌండ్ వచ్చే సమయానికి ఆయన 236 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన గెలుపు మాట అటుంచితే.. అసలు డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి లేకుండాపోయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమ్యూనిస్టులు.. పొత్తు కోసం ప్రయత్నించారు. కానీ, కాంగ్రెస్ కలిసిరాలేదు. పోనీ.. మిత్రపక్షం సీపీఐ సహకారం ఇస్తుందని ఆశించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఈ దశలో ఈ సీటును వదులుకునేందుకు మొదట్లో నాయకులు ప్రయత్నించారు. కానీ, సాహసం చేద్దామనే ఉద్దేశంతోను, తమకు తిరుగులేదనే భావనతోనూ.. ఇక్కడ కామ్రెడ్ తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
నిజానికి ప్రచారం నుంచే ఆయన వెనుకబడ్డారనే చర్చ వచ్చింది. ఇరు పక్షాలైన.. బీఆర్ ఎస్ నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి హేమాహేమీలు.. కోటీశ్వరులు రంగంలోకి దిగడంతో.. కనీసం డిపాజిట్లయినా దక్కుతాయనే ఆశలు వచ్చాయి. అయితే.. ఈ ఆశలపై కూడా.. తాజా ఫలితం నీళ్లు కుమ్మరించింది.
ఒకప్పుడు పాలేరు, ఉమ్మడి ఖమ్మం అంటే.. కమ్యూనిస్టులకు కంచుకోట. కానీ, చేజేతులా చేసుకున్న రాజకీయాలు.. ఇప్పుడు నేతలకు మింగుడు పడడం లేదు. వీరభద్రం కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత పరిస్థితిలో ఉండడం గమనార్హం, ఈ రోజు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఆయన.. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ఇంటికి వెళ్లిపోయారు.