Begin typing your search above and press return to search.

33 ఏళ్ల భారతీయ వివాహిత అరుదైన ఘనత!

ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాలను వేరు చేసే ఇంగ్లిష్‌ చానల్‌ లో ఇప్పటివరకు చాలామంది ఈత వేశారు.

By:  Tupaki Desk   |   3 July 2024 6:05 AM GMT
33 ఏళ్ల భారతీయ వివాహిత అరుదైన ఘనత!
X

ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాలను వేరు చేసే ఇంగ్లిష్‌ చానల్‌ లో ఇప్పటివరకు చాలామంది ఈత వేశారు. ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశంలో ఈత మొదలుపెట్టి అవతలి దేశాన్ని చేరుకున్నారు. 1959లోనే భారత్‌ కు చెందిన మిహిర్‌ సేన్‌ ఇంగ్లిష్‌ చానల్‌ ను ఈది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 60 మందికి పైగా ఈ ఫీట్‌ ను నమోదు చేశారు.

అయితే ఇప్పుడు 33 ఏళ్ల భారతీయ వివాహిత తన్వీ చవాన్‌ ఇంగ్లిష్‌ చానల్‌ ను ఈది అరుదైన రికార్డును సృష్టించారు. అది కూడా ఏకధాటిగా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా 17 గంటల 42 నిమిషాలపాటు.. ఏకంగా 42 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా ఈది సంచలనం సృష్టించారు. జూన్‌ 29న ఉదయం 8 గంటలకు ఆమె ఇంగ్లిష్‌ చానల్‌ ను ఈదడం ప్రారంభించారు.

ఇంగ్లండ్‌ లోని డోవర్‌ లో తన ఈతను మొదలుపెట్టిన తన్వీ చవాన్‌ ఫ్రాన్స్‌ లోని విస్సాంట్‌ వరకు ఆగకుండా ఏకధాటిగా ఈదుకుంటూ వెళ్లి అరుదైన ఘనతను సాధించింది. ఈ ఘనతను సాధించిన తొలి మాతృమూర్తిగా తన్వీ చవాన్‌ రికార్డులకెక్కింది. ఆమెకు ఐదేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

కఠినమైన వాతావరణ పరిస్థితులు, కేవలం 17 డిగ్రీల ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులు ఉన్నప్పటికీ, ఓవైపు జెల్లీ చేపలు కుడుతున్నప్పటికీ ఎక్కడా వెరవకుండా 17 గంటల 42 నిమిషాల్లో దాదాపు 42 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి తన్వీ చవాన్‌ సంచలనం సృష్టించింది.

కాగా తన్వీ చవాన్‌ వాతావరణ పరిస్థితులో ఆమె తన మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది. దీంతో ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చింది.

చిన్నప్పుడు తాను ఇంగ్లిష్‌ చానల్‌ ఈదిన వారి గురించి పత్రికల్లో చదివానని తన్వీ చవాన్‌ తెలిపారు. తాను కూడా ఆ సాహసాన్ని చేయాలని అప్పుడే అనుకున్నానన్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లిష్‌ చానల్‌ ను ఈదానన్నారు.

ఇన్నేళ్లపాటు చదువు, వివాహం, పిల్లలు తదితర కారణాల వల్ల తన కోరికను మర్చిపోయానని తన్వీ చవాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం ఈత నేర్చుకునేటప్పుడు తన లక్ష్యం మళ్లీ తనకు గుర్తుకు వచ్చిందని వెల్లడించారు.

కాగా తన్వీ చవాన్‌ ఎంబీఏ చేశారు. ఇంగ్లిష్‌ చానల్‌ ను ఈదడం కోసం ప్రత్యేకంగా నాసిక్‌ లో శంకర్‌ మాడ్గుండితో కలిసి 2–3 సంవత్సరాలు కఠినంగా ప్రాక్టీస్‌ చేశారు. అంతేకాకుండా ఆమె ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ ఛానెల్‌ ఈదడం కోసం శ్రీకాంత్‌ విశ్వనాథన్‌ ను కోచ్‌ గా కూడా నియమించుకుంది.

కాగా తన్వీ చవాన్‌ ఈత కొట్టే సమయంలో ఆమె తండ్రి కిరణ్, భర్త విప్లవ్‌ డియోర్, కోచ్, ఇద్దరు పైలట్లు ఆమె వెంటే ఉన్నారు.

ఆమెతో పాటు వచ్చిన ముగ్గురు సహ–ఈతగాళ్ళు దాదాపు 80% దూరం వచ్చాక.. మిగిలిన దూరాన్ని పూర్తిచేయలేక తప్పుకున్నారు. అయితే తన్వీ చవాన్‌ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన లక్ష్యాన్ని సాధించారు.