Begin typing your search above and press return to search.

ఇప్పుడు తారకరత్న బతికి ఉంటే... అలేఖ్య ఎమోషనల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం బయట టీడీపీ శ్రేణులు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 7:21 AM GMT
ఇప్పుడు తారకరత్న బతికి ఉంటే... అలేఖ్య ఎమోషనల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం బయట టీడీపీ శ్రేణులు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో దీక్ష చేపట్టారు. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య మాటలు ఆసక్తిగా మారాయి!

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో నందమూరి బాలయ్య సతీమణి వసుంధర, దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య స్పందించారు.

ఇందులో భాగంగా... చంద్రబాబు జైలు నుంచి బయటికొచ్చే వరకు కుటుంబ సభ్యులుగా తాము చేయాల్సిందంతా చేస్తామని తెలిపిన అలేఖ్య... తారకరత్న కూడా తమతోనే ఇక్కడే ఉన్నారని భావిస్తున్నామని అన్నారు. పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎవరు పిలిచినా మరోమాట లేకుండా తారకరత్న వెళ్లేవారని ఈ సందర్భంగా అలేఖ్య తెలిపారు.

ఇదే సమయంలో తాతగారంటే తారకరత్నకు ఎంతో ప్రాణమని చెప్పిన అలేఖ్య... చంద్రబాబు ఆలోచన తీరు, ఆయన దార్శనికతను తారకరత్న ఎంతో ఇష్టపడేవారని.. చంద్రబాబు అడుగుజాడల్లోనే ఆయన నడిచారని తెలిపారు. అనంతరం... తారకరత్న బతికుంటే కచ్చితంగా నిరసన దీక్షలో పాల్గొనే వారని.. తారకరత్నకు బదులుగా నేడు తాను, తన కుమార్తె వచ్చామని అలేఖ్య ఎమోషనల్ అయ్యారు.

ఇదే క్రమంలో... తారకరత్న స్థానంలో ఆ కుటుంబంలో సభ్యురాలిగా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నామని తెలిపిన అలేఖ్య... తారకరత్న తన చివరి క్షణాల్లో కూడా పార్టీ కార్యక్రమానికే వెళ్లారని, చివరి వరకు పార్టీ అంటే ప్రాణంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇక, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే వరకు మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి తమ పోరాటం కొనసాగుతోందని ఈ సందర్భంగా అలేఖ్య స్పష్టం చేశారు.

కాగా... చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మరోవైపు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ "సత్యమేవ జయతే" పేరుతో సోమవారం 7 గంటల పాటు దీక్ష చేపట్టారు.

ఇందులో భాగంగా... ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాజమండ్రిలోని క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దీక్షలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ నిరసన కార్యక్రమం జరిగింది.